రష్యా షూటర్స్కు క్లియరెన్స్
లాసానే: వచ్చే నెలలో రియోలో జరిగే ఒలింపిక్స్లో పాల్గొనేందుకు రష్యన్ షూటర్స్కు క్లియరెన్స్ లభించింది. ఈ మేరకు మంగళవారం అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ఐఎస్ఎస్ఎఫ్) .. రియోలో పాల్గొనే 18 మంది రష్యన్ షూటింగ్ బృందానికి ఆమోదం తెలిపింది. రియోలో పాల్గొనే రష్యా షూటర్ల వివరాలతో సంతృప్తి చెందినట్లు ఐఎస్ఎస్ఎఫ్ పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.
'మెక్ లారెన్ నివేదిక ప్రకారం వీరిలో ఎవరికీ డోపింగ్ కు పాల్పడిన రికార్డు లేదు. అందుచేత టెస్టుల్లో పాజిటివ్ వచ్చే సందర్భం కూడా ఉండదు. ఈ రష్యన్ అథ్లెట్లను క్షుణ్ణంగా పరీక్షించాం. వీరికి మా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది' అని ఐఎస్ఎస్ఎఫ్ పేర్కొంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తాజా నిబంధనల ప్రకారం రియోలో పాల్గొనే రష్యా అథ్లెట్లు ముందుగా ఆయా క్రీడల అంతర్జాతీయ సమాఖ్యల ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగా ఇప్పుడు రష్యా ఆటగాళ్లపై డోపింగ్ రికార్డును ఆయా ఒలింపిక్ సమాఖ్యలు పరీక్షించే పనిలో పడ్డాయి. ప్రస్తుతం రష్యాకు షూటింగ్ లో క్లియరెన్స్ లభించడంతో వారికి మోస్తరు ఉపశమనం లభించింది.