అపార్ట్మెంట్లో ప్రేమకథ!
అదో అందమైన అపార్ట్మెంట్. అందులో నివసించేవాళ్లకి కలుపుగోలుతనమూ ఎక్కువే. కలహానికి కాలు దువ్వడమూ ఎక్కువే. అయితే ఆ ఇద్దరికీ మాత్రం ఇవేం పట్టవు. అందరి కళ్లనూ తప్పించుకుని, ప్రేమ ఊసులు చెప్పుకోవడానికి తహతహలాడుతుంటారు. ఈ జంట ప్రేమ ప్రయాణం ఎలా మొదలైంది? ఆ ప్రేమకు శుభం కార్డు పడుతుందా? తదితర అంశాలతో రూపొందిన చిత్రం ‘ఎంత అందంగా ఉన్నావె’. ‘నువ్విలా’ ఫేమ్ అజయ్ మంతెన, జియానా జంటగా ఎస్.ఐ.మహేంద్ర దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై గంగపట్నం శ్రీధర్ నిర్మించారు. ఈ నెల 8న ఈ చిత్రం విడుదల కానుంది.
నిర్మాత మాట్లాడుతూ-‘‘ఓ అపార్ట్మెంట్లో ఓ యువతీ యువకుడి మధ్య పుట్టిన ప్రేమకథతో ఈ సినిమా తీశాం. కచ్చితంగా యువతరాన్ని, కుటుంబ ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుంది’’ అని తెలిపారు. దర్శకుడు ఎస్.ఐ. మహేంద్ర మాట్లాడుతూ -‘‘సిరివెన్నెల సాహిత్యం, యోగీశ్వర శర్మ సంగీతం ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్. అల్లర్లు, అలకలు, తమాషాలు, భావోద్వేగాలతో సినిమా సరదా సరదాగా సాగిపోతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: అశోక్ సోని, మహ్మద్ రఫీ, సమర్పణ: తమ్మిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి.