దేశ చరిత్రను మార్చే శక్తి బీసీలకు ఉంది
అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి
హైదరాబాద్: ఓబీసీలందరూ సంఘటితమై సమస్యలు పరిష్కరించుకోవాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి పిలుపునిచ్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారమిక్కడి పద్మశాలి భవన్లో జరిగింది.
ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. బలమైన ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని, దీనికి ఓబీసీలు ముందుకు రావాలన్నారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ.. భారతదేశ చరిత్రను మార్చే శక్తి ఓబీసీలకు ఉందన్నారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన, ప్రజాస్వామ్యబద్ధమైన హక్కుల కోసం తెగించి పోరాడాలని సూచించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి, స్వామిగౌడ్, ఆర్.కృష్ణయ్యలను ఉద్యోగులు ఘనంగా సత్కరించారు.