తెలంగాణ సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీగా నర్సింగరావు!
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : సింగరేణి మాజీ సీ అండ్ ఎండీ, ప్రస్తుత కోలిండియా చైర్మన్ ఎస్.నర్సింగరావు తెలంగాణ కొత్త రాష్ట్రంలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 1986 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయనను పరిపాలనలో కీలక పాత్ర పోషించే సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీగా నియమించడం దాదాపు ఖరారైందని విశ్వసనీయ సమాచారం. సోమవారం కేసీఆర్ గవర్నర్ భేటీకి ఆయనను వెంటబెట్టుకుని వెళ్లినట్లు తెలిసింది. కోలిండియా చైర్మన్‌గా కొనసాగుతున్న నర్సింగరావును తెలంగాణ రాష్ట్రానికి డెప్యుటేషన్‌పై పంపాలని కేసీఆర్ ఈ సందర్భంగా గవర్నర్‌ను కోరినట్లు సమాచారం.
ఉద్యోగుల ఆప్షన్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపిణీ, ఇంకా ఇతర పాలనాపరమైన అంశాలపైనా నర్సింగరావుతో కలిసి కేసీఆర్ గవర్నర్‌తో చ ర్చించినట్లు తెలిసింది. రాష్ట్ర సర్వీసులో ఉన్నప్పుడూ కేసీఆర్, నర్సింగ్‌రావు మధ్య మంచి సంబంధాలు ఉండేవి. కోలిండియాలో చేరిన తర్వాత అక్కడ కంపెనీ లాభాలను గణనీయంగా పెంచారు. లాభాల నుంచి మొదటిసారి డివిడెంట్ ఇప్పించి ఆయన తన మార్కును చాటుకున్నారు.
సింగరేణిలో చెరగని ముద్ర..
తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమ అయిన సింగరేణిలో నర్సింగరావు చెరగని ముద్ర వేశారు. ఆయన 2006 సెప్టెంబర్ 18 నుంచి 2012 ఏప్రిల్ 23 వరకు సింగరేణి సీఅండ్ఎండీగా పనిచేశారు. ఐదేళ్లపాటు సింగరేణిలో పనిచేసిన చైర్మన్ అయనొక్కడే కావడం విశేషం. ఆయన హయాంలోనే సింగరేణి ఎంతో అభివృద్ధి గడించి, మంచి పేరు, ప్రఖ్యాతలు సాధించింది. కంపెనీలో మానవ వనరుల అభివృద్ధికి పాటుపడినట్లు ఆయనకు పేరుంది.
కంపెనీ 50 మిలియన్ టన్నుల భారీ లక్ష్యాన్ని దాటి 53 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి తీసుకెళ్లిన ఘనత ఆయనదే. కంపెనీలో పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటు, రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జీవో అమలుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. అవినీతిని అరికట్టడం నుంచి సింగరేణి ప్రక్షాళన అంతా ఆయన హయాంలోనే జరిగింది. రూ.4 వేల కోట్లతో జైపూర్ మండల కేంద్రంలో 1200 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు ఆయన కలల స్వప్నంగా పేరుంది. ఆయన చొరవతోనే కేంద్రం ఏర్పాటు సాధ్యమైంది.
ఈ ప్రాజెక్టుతో కంపెనీని విద్యుత్ రంగంలోకి కూడా తీసుకువచ్చి మరింత ఆర్థిక భద్రతకు బాట వేశారు. సింగరేణికి ముందు ఆయన రూరల్ డెవలప్మెంట్లో కమిషనర్‌గా, ఐటీ కమ్యూనికేషన్ శాఖ డెరైక్టర్‌గా, వైజాగ్, చిత్తూర్ కలెక్టర్‌గా, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇంతటి పాలన దక్షకుడిగా పేరుండడంతో కేసీఆర్ మరీ పట్టుబట్టి ఆయనను తెలంగాణకు డెప్యుటేషన్‌పై తీసుకువస్తున్నారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఆయనను సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీగా ప్రకటించడం లాంఛనమేనని తెలుస్తోంది.