జయలలిత ఆరోగ్యంపై మరో అప్ డేట్!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జె.జయలలిత ఆరోగ్యం మెరుగ్గా ఉందని ఆ పార్టీ కీలకనేతలు బుధవారం తెలిపారు. ఆమె ఆరోగ్యం సాధారణ స్థితికి వచ్చిందని, గతంలో మాదిరిగానే ఆమె అందరి ముందుకు త్వరలోనే వస్తారని చెప్పారు. అన్నాడీఎంకే అధికార ప్రతినిధి ఎస్.రామచంద్రన్ మాట్లాడుతూ.. అమ్మ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆమె పూర్తిగా కోలుకుంటున్నారని, కొన్ని రోజుల్లో యథాతథంగా రాష్ట్ర పరిపాలన కొనసాగిస్తారని ఆయన దీమా వ్యక్తంచేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆమె అభిమానుల పూజలు, ప్రత్యేక ప్రార్థనలు ఫలించి జయలలిత కోలుకుంటున్నారని చెప్పారు.
సీఎం ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉందని అపోలో వైద్యులు చెప్పారని జయ సన్నిహితురాలు, పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతీ మీడియాకు తెలిపారు. అయితే ఆమె పూర్తిగా కోలుకునేంతవరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని, ఇప్పుడిప్పుడే జయలలిత నార్మల్ లైఫ్ లోకి వస్తున్నారని చెప్పారు. పార్టీ నేతలు, ప్రజలు చేసిన పూజలు, ప్రార్థనల వల్ల అమ్మ మళ్లీ మామూలు మనిషి అయ్యారని హర్షం వ్యక్తంచేశారు. దీపావళి పండుగకు జయలలిత హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అవుతారని అక్టోబర్ 27న ప్రకటన విడుదల అవుతుందని ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. గత రెండు వారాలుగా ఆమె ఆరోగ్యంపై ప్రభుత్వంగానీ, అస్పత్రి వర్గాలుగానీ హెల్త్ బులెటిన్స్ కూడా లేకపోవడంతో అమ్మ అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
డీహైడ్రేషన్, జ్వరంతో బాధపడుతున్న సీఎం జయలలిత సెప్టెంబర్ 22నుంచి చెన్నై అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే అమ్మకు సంబంధించిన హెల్త్ బులెటిన్ చివరగా అక్టోబర్ 21న విడుదలచేశారు. ఆ తర్వాత జయలలిత ఆరోగ్యంపై ఎలాంటి ప్రకటన, సమాచారం లేకపోవడంతో ఇది ఎన్నో అనుమానాలకు దారితీసింది. లండన్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుల బృందం, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో జయ చికిత్స తీసుకుంటున్నారు.