s v ranga rao
-
ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న చిరు
సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించనున్నారు. తాడేపల్లి గూడెంలోని ఎస్వీఆర్ సర్కిల్ వద్ద ఆగస్టు 25న ఉదయం 10.15నిమిషాలకు అభిమానుల సమక్షంలో చిరంజీవి విగ్రహావిష్కరణ చేయనున్నారు.ఎస్వీఆర్ పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు.. ఈయన కృష్ణా జిల్లా, నూజివీడులో జూలై 3, 1918 లో జన్మించగా.. 18 జూలై 1974లో పరమపదించారు. చదువుకునే రోజుల నుంచీ నాటకాల్లో నటించారు. షేక్ స్పియర్ డ్రామాల్లో నటించిన అనుభవంతోనే సినీనటుడు అయ్యారు. చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసరుగా కొద్ది రోజులు ఉద్యోగం చేసిన ఆయన నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం ఆయనకు నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. కొద్ది రోజులు జంషెడ్పూర్ లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు- తమిళ- కన్నడ, మలయాళ-హిందీ భాషల్లో 300 పైగా చిత్రాల్లో నటించారు. రావణుడు, హిరణ్య కశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు- మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలతో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. -
ఆయనను చూసే ఇండస్ట్రీలోకి వచ్చాను : చిరంజీవి
తెలుగు తెరపై చెరిగిపోని నటుడు ఎస్వీరంగారావు.. శత జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని కీలక ఘట్టాలను ‘మహా నటుడు’ పేరుతో ఫొటో బయోగ్రఫీగా రూపొందించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకాగా.. తమ్మారెడ్డి భరద్వాజ, బ్రహ్మానందం, తణికెళ్ల భరణి లాంటి ప్రముఖులు విచ్చేశారు. మహానటుడు ఎస్వీ రంగారావును చూసే తాను సినీ పరిశ్రమలోకి వచ్చానని చిరంజీవి అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘నేను గొప్పగా ఆరాధించే రంగారావు గారి పుస్తకం నేను రిలీజ్ చేయడం నా పూర్వ జన్మ సుకృతం. మా నాన్న గారికి రంగారావు అంటే ఎంతో అభిమానం. ఆయన రంగారావుతో సినిమా చేశారు. ఇంటికి వచ్చి రంగారావు గురించి గొప్పగా చెప్పేవారు అప్పటి నుంచి ఆయన అన్నా, నటన అన్నా నా ఒంట్లో బీజం పడింది. రామ్చరణ్ ఇండస్ట్రీలోకి రావాలని చెప్పగానే రంగారావు గారి సినిమాలు చూడమని సలహా ఇచ్చాను’ అని అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ.. మహానటుడు ఎస్వీ రంగారావు గారి మీద సంజయ్ కిషోర్ పుస్తకం రాశారు.. అలాగే చిరంజీవి మీద కూడా పుస్తకం రాయాలని ఆయనను కోరారు. సంజయ్ ఏది చేసినా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటున్నారని, ఎంతో బాధ్యతగా, సంతోషంగా చిరంజీవిపై పుస్తకాన్ని రాస్తానని సంజయ్ కిషోర్ అన్నట్లు తెలిపారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ఇటువంటి పుస్తకాలు తరువాతి తరానికి అవసరమని అన్నారు. ఇలాంటి పుస్తకాలను చిరంజీవి లాంటి వ్యక్తి విడుదల చేస్తేనే విలువ ఉంటుందని అన్నారు. చిరంజీవిని ఇండస్ట్రీ గురించి పట్టించుకోవాలని అడిగానని, ఆయన కొన్ని విన్నారని, కొన్ని చేశారని, మరికొన్ని సమస్యలు మీద వేసుకున్నారని అన్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. వ్యక్తి బతికి ఉండగా పట్టించుకోని వారున్న ఈ రోజుల్లో.. 45ఏళ్ల తరువాత రంగారావు గారి పుస్తకం రాయడమంటేనే ఆయన విలువ తెలుస్తోందని అన్నారు. -
ప్రియనేస్తాలు...
అపురూపం సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరికీ పెంపుడు జంతువులంటే ఇష్టం! ముఖ్యంగా కుక్కలన్నా, వాటి పెంపకమన్నా ఎంతో ఇష్టం. ఎందుకంటే... అవి ఇంటిలో ఉంటే ఓ అందం సందడిగా తిరుగుతుంటే ఇల్లు కళ కళ! వాటి పెంపకం ఓ స్టేటస్ సింబల్! అన్నింటికీ మించి విశ్వాసానికి కేరాఫ్ అడ్రస్! నాటి నుండి నేటి వరకు సెలబ్రెటీలకు పెంపుడు జంతువులు ఓ ప్రియనేస్తాలు! కారణం తమ డబ్బు, కీర్తి, స్టేటస్ వారికి అవసరం లేదు గనుక! అందుకే ఉన్న కాస్త ఖాళీ టైమ్లో పెంపుడు జంతువులతో కాలక్షేపం చేయటానికి ఇష్టపడతారు మన సెలబ్రిటీలు. అందానికి పొమరేనియన్లు, స్టేటకి, కాపలాకి ఆల్సెషన్లు, డాబర్మెన్లు, ఇంకా రకరకాల పెంపుడు జంతువులను పెంచిన, పెంచుతున్న సెలబ్రిటీలు ఎందరో! నాటి సినీనటి జమున ఇంట్లో ఇప్పటికీ ఓ అరడజను కుక్కలుండాల్సిందే. వాటిని తమ సొంతబిడ్డల్లా చూసుకుంటారామె! ఆ రోజుల్లో తను పెంచుతున్న పొమరేనియన్ కుక్కలతో జమున దిగిన స్టిల్ చూడండి. అలాగే ఠీవికి మారుపేరైన ఎస్.వి.రంగారావు చెంత అంతే ఠీవిగా కూర్చుని ఉన్న ఆల్సెషన్ కనిపిస్తుంది. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తాను సినీనటిగా ఉన్న రోజుల్లో తన పెంపుడు పొమరేనియన్తో ఆడుకుంటున్న దృశ్యాన్నీ వీక్షించండి. ఈ ప్రియనేస్తాలకు ఎన్నో ముద్దుపేర్లు పెడతాం. అవి బాధపడితే మనం బాధపడతాం. అవి చనిపోతే అయినవాళ్లు పోయినంత దుఃఖిస్తాం. ఎందుకంటే... అవి ప్రేమను చూపిస్తాయి. విశ్వాసంగా ఉంటాయి. ఎదురు చెప్పవు. ఎదురు తిరగవు. చెప్పిన మాట వింటాయి. చెప్పుడు మాటలు వినవు. ఒక్క మాటలో చెప్పాలంటే... మనకోసం జీవిస్తాయి! చనిపోయినా మనలోనే జీవిస్తాయి!! నిర్వహణ: సంజయ్ కిషోర్