
ప్రియనేస్తాలు...
అపురూపం
సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరికీ పెంపుడు జంతువులంటే ఇష్టం!
ముఖ్యంగా కుక్కలన్నా, వాటి పెంపకమన్నా ఎంతో ఇష్టం.
ఎందుకంటే... అవి ఇంటిలో ఉంటే ఓ అందం
సందడిగా తిరుగుతుంటే ఇల్లు కళ కళ!
వాటి పెంపకం ఓ స్టేటస్ సింబల్!
అన్నింటికీ మించి విశ్వాసానికి కేరాఫ్ అడ్రస్!
నాటి నుండి నేటి వరకు సెలబ్రెటీలకు పెంపుడు జంతువులు ఓ ప్రియనేస్తాలు!
కారణం తమ డబ్బు, కీర్తి, స్టేటస్ వారికి అవసరం లేదు గనుక! అందుకే ఉన్న కాస్త ఖాళీ టైమ్‌లో పెంపుడు జంతువులతో కాలక్షేపం చేయటానికి ఇష్టపడతారు మన సెలబ్రిటీలు. అందానికి పొమరేనియన్‌లు, స్టేటకి, కాపలాకి ఆల్సెషన్‌లు, డాబర్‌మెన్‌లు, ఇంకా రకరకాల పెంపుడు జంతువులను పెంచిన, పెంచుతున్న సెలబ్రిటీలు ఎందరో!
నాటి సినీనటి జమున ఇంట్లో ఇప్పటికీ ఓ అరడజను కుక్కలుండాల్సిందే. వాటిని తమ సొంతబిడ్డల్లా చూసుకుంటారామె! ఆ రోజుల్లో తను పెంచుతున్న పొమరేనియన్ కుక్కలతో జమున దిగిన స్టిల్ చూడండి. అలాగే ఠీవికి మారుపేరైన ఎస్.వి.రంగారావు చెంత అంతే ఠీవిగా కూర్చుని ఉన్న ఆల్సెషన్ కనిపిస్తుంది. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తాను సినీనటిగా ఉన్న రోజుల్లో తన పెంపుడు పొమరేనియన్‌తో ఆడుకుంటున్న దృశ్యాన్నీ వీక్షించండి.
ఈ ప్రియనేస్తాలకు ఎన్నో ముద్దుపేర్లు పెడతాం. అవి బాధపడితే మనం బాధపడతాం. అవి చనిపోతే అయినవాళ్లు పోయినంత దుఃఖిస్తాం.
ఎందుకంటే... అవి ప్రేమను చూపిస్తాయి. విశ్వాసంగా ఉంటాయి.
ఎదురు చెప్పవు. ఎదురు తిరగవు.
చెప్పిన మాట వింటాయి. చెప్పుడు మాటలు వినవు.
ఒక్క మాటలో చెప్పాలంటే...
మనకోసం జీవిస్తాయి! చనిపోయినా మనలోనే జీవిస్తాయి!!
నిర్వహణ: సంజయ్ కిషోర్