sabaash naidu
-
శభాష్‌గా తెరకెక్కిస్తున్నారు
నాన్న శభాష్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అని అంటున్నారు క్రేజీ హీరోయిన్ శ్రుతిహాసన్. ఈ బ్యూటీ ఏ చిత్రం గురించి చెబుతున్నారో ఈ పాటికే అందరికీ అర్థం అయ్యి ఉంటుంది. శ్రుతిహాసన్ తొలిసారిగా తన తండ్రి, విశ్వనటుడు కమలహాసన్‌తో కలిసి నటిస్తున్న చిత్రం శభాష్‌నాయుడు. కమల్ స్వీయ దర్శకత్వంలో తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై లైకా సంస్థతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం ఇప్పటికే అమెరికాలో షూటింగ్ తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. శభాష్‌నాయుడు తదుపరి షెడ్యూల్ కమల్ తన కార్యాలయంలోని మెట్ల మీద నుంచి కాలు జారి పడి ఆస్పత్రిలో చేరడం కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజగా ఈ చిత్ర షూటింగ్‌కు కమలహాసన్ సన్నాహాలు చేస్తున్నారు. జనవరి తొలి వారంలో శభాష్‌నాయుడు మళ్లీ సెట్‌పైకి వెళ్లనుంది. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న శ్రుతిహాసన్ శభాష్‌నాయుడు చిత్రం గురించి తెలుపుతూ నాన్న చిత్రాన్ని బ్రహ్మాండంగా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారనని చెప్పారు. ఆయన సన్నివేశం సంతృప్తిగా వచ్చే వరకూ తీస్తూనే ఉంటారని తెలిపారు.అంతగా దృష్టి పెట్టి శభాష్నాయుడికి రూపకల్పన చేస్తున్నారని వివరించారు. తనకు నచ్చేవరకూ మరో సన్నివేశం జోలికి వెళ్లరని చెప్పారు. ఈ చిత్రంలో నటించడం తనకు అద్భుతమైన అనుభవం అని పేర్కొన్నారు. అయితే నాన్నతో నటించడానికి మొదట చాలా భయపడ్డానని శ్రుతిహాసన్ అన్నారు. ప్రస్తుతం ఈ బోల్డ్ అండ్ బ్యూటీ తెలుగులో పవన్‌కల్యాణ్‌తో రొమాన్స్ చేస్తున్నారు. -
నా పేరుని మా నాన్న మరచిపోయారు!
కన్న కూతురి పేరుని తండ్రి మరచిపోతే ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. అందుకే ‘నా పేరుని మా నాన్న మరచిపోయారు’ అని శ్రుతీహాసన్ అంటే, ఎవరైనా ఆశ్చర్యపోతారు. కమల్‌హాసన్ ముద్దుల కూతురు శ్రుతి ప్రస్తుతం తన తండ్రికి రీల్ డాటర్‌గా ‘శభాష్ నాయుడు’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కమల్ రెండో కూతురు అక్షరాహాసన్ సహాయ దర్శకురాలిగా చేస్తున్నారు. తండ్రి, చెల్లితో కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందంటున్నారు శ్రుతి. ఈ చిత్ర షూటింగ్ స్పాట్లో కొన్నాళ్ళ క్రితం జరిగిన గమ్మత్తై విషయాన్ని శ్రుతీహాసన్ చెబుతూ - ‘‘కమల్ నాకు నాన్న మాత్రమే కాదు.. ఈ చిత్రదర్శకుడు, కో-స్టార్ కూడా. భలే గమ్మత్తుగా ఉంది. ఒక సీన్లో ఆయన నన్ను పేరు పెట్టి పిలవాలి. కానీ, ఈ సినిమాలో నా పాత్ర పేరుతో కాకుండా నా రియల్ నేమ్‌తో పిలిచారు. అప్పుడు నేను ‘రాంగ్ నేమ్ అయినా.. థ్యాంక్యూ’ అన్నాను. ఈ సినిమా నాకో స్వీట్ మెమరీ అవుతుంది’’ అనినవ్వుతూ అన్నారు. ఈ చిత్రం కాస్ట్యూమ్స్ విషయంలో గౌతమితో శ్రుతీకి మనఃస్పర్థలు వచ్చాయనే వార్త రావడం, అలాంటిదేమీ లేదని శ్రుతి స్పష్టం చేయడం తెలిసిందే. కమల్‌కి గౌతమి అత్యంత సన్నిహితురాలనీ, ఇద్దరూ కలసి ఉంటారనీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గౌతమితో మనఃస్పర్థలు నెలకొన్నాయనే వార్త వచ్చిన తర్వాత మీరు ఆమెతో మాట్లాడారా? అని శ్రుతీని ఓ ఆంగ్ల పత్రిక అడిగితే - ‘‘మా నాన్న కాంబినేషన్లో చేస్తున్న ‘శభాష్ నాయుడు’ షూటింగ్‌కి చిన్న బ్రేక్ వచ్చింది. నేను నా మిగతా సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాను. మా నాన్ననీ, చెల్లెల్నీ కలవడానికి కూడా తీరిక లేదు. అయితే ఒక్కటి మాత్రం చెబుతాను. ఈ ప్రపంచంలో నాకు ముఖ్యమైన వ్యక్తుల్లో మా నాన్నగారు ఒకరు. ఆయనకు ముఖ్యమైన వ్యక్తి(గౌతమి)ని నేను కచ్చితంగా గౌరవిస్తా’’ అన్నారు. -
మూడు భాషల్లో ఒకేసారి అగ్రహీరో సినిమా
విశ్వనాయకుడు కమల్‌హాసన్ త్వరలో మూడు భాషల్లో ఒకేసారి సినిమా తీయబోతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో 'శభాష్ నాయుడు', హిందీలో 'శభాష్ కుందు' అనే పేర్లతో ఈ సినిమా తీయబోతున్నారు. ఈ విషయాన్ని కమల్ హాసన్ తన సినిమా లాంచింగ్ సందర్భంగా వెల్లడించారు. ఈ సినిమాకు టీకే రాజీవ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కమల్‌తో పాటు ఆయన కూతురు శ్రుతిహాసన్ కూడా ఈ సినిమాలో నటించడం మరో విశేషం. విశ్వనాయకుడి సరసన రమ్యకృష్ణ హీరోయిన్గా చేస్తుండగా, బ్రహ్మానందం కూడా ఓ ముఖ్యపాత్రలో మెరుస్తారు. గతంలో 2008 సంవత్సరంలో కమల్ తీసిన దశావతారం సినిమాలో 'బలరాం నాయుడు' అనే సీబీఐ ఆఫీసర్ పాత్రను మళ్లీ ఇందులో పోషిస్తున్నారు. ఆయన అసిస్టెంట్‌గా బ్రహ్మానందం కనిపిస్తారు. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్లో తీస్తున్న ఈ సినిమా షూటింగ్ మే రెండోవారం నుంచి ప్రారంభమవుతుంది. దీనికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.