ఔను నిజం! విమానం ఎగిరేముందు..!
ఇటీవల పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్-42 విమానం కూలిపోయి.. 47మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనతో పాక్ ఎయిర్‌లైన్స్ అధికారులు భయపడ్డారో.. లేక మూఢనమ్మకాన్ని నమ్మితే తప్పేముందని అనుకున్నారోగానీ, వారు చేసిన ఓ చర్య మాత్రం నెటిజన్లను విస్మయపరుస్తోంది.
ఏటీఆర్-42 విమానం కూలిపోయిన అనంతరం ఇటీవల ఏటీఆర్ సిరీస్‌కు చెందిన విమానం తొలిసారి ప్రయాణిస్తున్న సందర్భంగా వారు ఓ వింత చర్యకు పాల్పడ్డారు. ఓ నల్లటి మేకను ఇస్లామాబాద్‌లోని విమానాశ్రయానికి తీసుకొచ్చి.. ఎగరడానికి సిద్ధంగా ఉన్న విమానం ముందు దానిని బలి ఇచ్చారు. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)కు చెందిన అధికారులు స్వయంగా ఈ తంతులో పాల్గొన్నారు. వారు మేకను విమానం ముందు పడుకోబెట్టి..పీక కోసి రక్తతర్పణం చేసిన తర్వాతే.. పైలట్లు విమానాన్ని నడిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు వెలుగుచూడటం నెటిజన్లను షాక్‌కు గురిచేసింది.
మూఢనమ్మకాల పేరిట సాక్షాత్తు అధికారులు, పైలట్లే ఒక మూగజీవాన్ని బలివ్వడం మూర్ఖత్వానికి నిలువుటద్దమని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. మూగజీవాల్ని బలివ్వడం వంటి చర్యలు మానుకొని విమాన ప్రయాణాల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని పాక్ ఎయిర్‌లైన్స్‌కు పలువురు సూచిస్తున్నారు. 'ఇది జోక్ కాదు. తన విమానాల రక్షణ కోసం పాకిస్థాన్ తీసుకొంటున్న సరికొత్త భద్రతాచర్యలివే' అని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.