అభ్యర్థుల సమక్షంలో మాక్‌పోల్ నిర్వహించాలి
సదాశివపేట, న్యూస్‌లైన్:మున్సిపల్ పోలింగ్‌కు గంట ముందుగా పోలింగ్ కేంద్రంలో అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో మాక్‌పోల్ నిర్వహించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై అనుమానాలను నివృత్తి చేయాలని ఎన్నికల కమిటీ రాష్ట్ర పరిశీలకుడు హరిప్రీత్‌సింగ్ ఎన్నికల అధికారులకు సూచించారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలతో పాటు ఎన్నికల సామగ్రిని అందజేశారు. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇక్కడికి వచ్చిన హరిప్రీత్‌సింగ్ ఎన్నికల సిబ్బందికి సూచనలు, సలహాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఓటుహక్కు కలిగినవారిని మాత్రమే పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించాలన్నారు. దొంగ ఓట్లు పడకుండా ఎన్నికల సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలనీ, రెండు శాతం టెండర్ ఓట్లు పోలైతే రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయానికి సమాచారం అందిస్తే ఆ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహిస్తామన్నారు.
పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లు, అభ్యర్థులు కాకుండా ఇతర ప్రజాప్రతినిధులు ప్రవేశించి ఇబ్బంది పెడితే ఎన్నికల నిబంధనల ప్రకారం వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. పోలింగ్ సిబ్బంది నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని, ఇతరులకు అనుకూలంగా వ్యవహరించిన పోలింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌నాయుడు, ఎన్నికల అధికారి లింబాద్రిలతో ప్రత్యేకంగా సమావేశమై పట్టణంలో ఎన్నికల నిర్వహణ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
పట్టణంలో 28 పోలింగ్ కేంద్రాల్లో 17 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌నాయుడు హరిప్రిత్సింగ్కు వివరించారు. అనంతరం జేసీ శరత్ పోలింగ్ ఏర్పాట్లు పరిశీలించి, ఎన్నికల సిబ్బందికి సలహాలు సూచనలు చేశారు.