ఆదివాసీ హక్కుల కోసం.. త్యాగాలకు వెనుకాడం
ఇల్లెందు అర్బన్, న్యూస్‌లైన్: ఆదివాసీల హక్కుల సాధనకు ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడేది లేదని పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య అన్నారు. గిరిజనుల హక్కులను కాపాడేది విప్లవ పార్టీలేనని చెప్పారు. శుక్రవారం రాత్రి ఇల్లెందు కొత్తబస్టాండ్ ఆవరణంలో జరిగిన ఎన్డీ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. అడవులను పరిరక్షించుకునేందుకు ఆదివాసీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వారికి ఏ కష్టమొచ్చినా అండగా ఉంటామన్నారు. ఆదివాసీల చట్టాలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
గిరిజన పోరాటాల ఫలితంగా వారి రక్షణ కోసం 1920 నుంచే చట్టాలు చేశారని, అయితే పాలకుల నిర్లక్ష్యంతో అవి అమలు కావడం లేదని ఆరోపించారు. 1/70 చట్టం వచ్చినా భూ బదలాయింపును అడ్డుకోలేకపోతోందన్నారు. ప్రజల ఒత్తిడి ఫలితంగా 2006 డిసెంబర్ 29న అటవీ హక్కుల గుర్తింపు చట్టం వచ్చిందని గుర్తు చేశారు. ఈ చట్టం వల్ల 10 ఎకరాలు అనుభవించే హక్కు గిరిజనుడికి ఉందన్నారు. జిల్లాలో బీడీ ఆకు అధికంగా లభ్యమవుతున్నందున బీడీ పరిశ్రమలను నెలకొల్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సబ్‌ప్లాన్ నిధులను ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికే కేటాయించాలన్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు సాధినేని వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం ఓపెన్‌కాస్టుల పేరుతో పచ్చని పల్లెలను బొందలగడ్డగా మారుస్తోందని, అడవులు అంతరిస్తున్నాయని ఆరోపించారు. ఓపెన్‌కాస్టులు ఏర్పడిన ప్రాంతాల్లో జలవనరులు కూడా అడుగంటిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీల కింద వేల ఎకరాల సాగుభూమి పోతోందన్నారు. సింగరేణి సంస్థ ఏజెన్సీ ప్రాంతాల్లో గనులను ప్రారంభిస్తున్నదే తప్ప ఆయా ప్రాంతాల గిరిజనులకు ఉపాధి కల్పించడం లేదని విమర్శించారు. అధిక ఉత్పత్తి, లాభాల కోసం గిరిజన ప్రాంతాలను ఓసీలతో విధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓసీలతో బొందల గడ్డగా మార్చొద్దని సింగరేణి యాజమాన్యానికి సూచించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లయినా నేటికీ అందరికీ ఆహార భద్రత లేదని వాపోయారు.
పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గోవర్ధన్ మాట్లాడుతూ.. సీల్డ్ కవర్లో సీఎం పదవి దక్కించున్న కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణ విషయంలో రోజుకొక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. అధిష్టానం మాట గౌరవిస్తానని నాడు చెప్పిన కిరణ్.. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా తెలంగాణ బిల్లును తిప్పి పంపుతానని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరికీ మరో తోడు దొంగలా అశోక్‌బాబు తయారయ్యాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం 1969లో 369 మంది మృతి చెందితే, నేడు వెయ్యి మందికి పైగా అమరులయ్యారని, ఈ విషయాన్ని సీమాంధ్రులు గుర్తుంచుకోవాలని అన్నారు. సభలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, నాయకులు ముక్తార్‌పాషా, వెంకటేశ్వర్లు, వెంకన్న, గౌని ఐలయ్య, జడ సత్యనారయణ, విశ్వనాథం, సీతారామయ్య, యదళ్లపల్లి సత్యం, భూక్యా లక్ష్మణ్, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎరుపెక్కిన బొగ్గుట్ట
బహిరంగ సభకు ముందు సుమారు ఆరువేల మంది ఎన్డీ కార్యకర్తలు అరుణ పతాకాలు చేబూని భారీ ప్రదర్శన నిర్వహించారు. జేకే కాలనీ నుంచి జగదాంబ సెంటర్, పాత బస్టాండ్ ,బుగ్గవాగు బ్రిడి మీదుగా కొత్త బస్టాండ్ సెంటర్ వరకు ప్రదర్శన సాగింది. అరుణ పతాకాల రెపరెపలతో బొగ్గుట్ట ఎరుపెక్కింది. ఈ సందర్భంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, భూగర్భ గనులను ఏర్పాటు చేయాలని, దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం బహిరంగ సభ వేదికపై అరుణోదయ కళకారులు చేసిన నృత్యాలు, గేయాలు ఉర్రూతలూగించాయి.