'సాధ్విని మంత్రి పదవి నుంచి తొలగించాలి'
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయ సభల్లో దుమారం చెలరేగింది. సాధ్విని మంత్రి పదవి నుంచి తొలగించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. రాజ్యసభ జీరో అవర్లో ఈ విషయాన్ని విపక్షాలు ప్రస్తావించాయి. గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
తప్పుచేశానని సాధ్వి అంగీకరించారని, ఆమె పదవి నుంచి తప్పుకోవాలని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. లోక్సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లికార్జున ఖర్గే కూడా సాధ్వి రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు జోక్యం చేసుకుంటూ సాధ్వి క్షమాపణలు చెప్పినందున రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా సాధ్వి రాజీనామా చేసి తీరాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేయడంతో ఉభయ సభల్లో గందరగోళం ఏర్పడింది.
సాధ్వి ఇటీవల ఢిల్లీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. 'ఢిల్లీలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సింది రాముడి సంతానమా? లేక అక్రమ సంతానమా?.. తేల్చాల్సింది మీరే' అని ప్రసంగించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.