ముగిసిన మహాశివరాత్రి ఉత్సవ యాగాలు
శ్రీశైలం: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 10 నుంచి నవాహ్నిక దీక్షతో ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవ యాగాలు గురువారం పూర్ణాహుతితో ముగిశాయి. తొమ్మిది రోజులపాటు స్వామిఅమ్మవార్లకు జరిగిన నిత్యహోమబలిహరణలు, జపానుష్థానములు, స్వామివార్లకు విశేషార్చనలు, అమ్మవారికి నవావరణార్చనలు తదితర పూజలకు ముగింపుగా రుద్ర,చండీహోమాలకు పూర్ణాహుతి జరిగింది. ఉదయం ప్రత్యేకపూజలను నిర్వహించిన అనంతరం 10.45 గంటలకు పూర్ణాహతిని నిర్వహించారు ఈఓ సాగర్‌బాబు, అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి ద్రవ్యాలకు ప్రత్యేకపూజలను చేశారు.
పూర్ణాహుతి ద్రవ్యాలైన నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు మొదలైన పూర్ణాహుతి ద్రవ్యాలను హోమగుండానికి సమర్పించారు. కార్యక్రమం ముగిశాక, వసంతోత్సవంలో భాగంగా ఆలయ అర్చకులు, వేదపండితులు పూర్ణాహుతిలో పాల్గొన్న వారందరిపై వసంతాన్ని (పసుపు,సున్నం కలిపిన మంత్రపూరిత జలం) సమంత్రకంగా భక్తులతో ప్రొక్షించారు. అనంతరం ఉత్సవనిర్వాహకుడైన చండీశ్వరుని పల్లకీలో ఊరేగిస్తూ ఆలయప్రదక్షిణ చేయించి మల్లికా గుండం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ఆ స్వామికి విశేషపూజలను నిర్వహించారు. చండీశ్వరునికి వేదమంత్రోచ్ఛారణల మధ్య త్రిశూల స్నానం చేయించారు. వైష్ణవాచారంలో దీనినే చక్రస్నాన ం అంటారని, శైవసంబంధమైన క్షేత్రాలలో త్రిశూల స్నానంగా అభివర్ణిస్తారని వేదపండితులు తెలిపారు.
ఉత్సవాల ముగింపు సూచనగా
ధ్వజావరోహణ:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 10న ప్రారంభంగా కాగా ఉత్సవాల ఆరంభ సూచనగా ఈ నెల 10న సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ చేశారు. గురువారం ఉత్సవాలు ముగియడంతో ఉదయం పూర్ణాహుతిని నిర్వహించి అదేరోజు సాయంత్రం 7గంటల నుంచి ధ్వజావరోహణ కార్యక్రమ పూజలను నిర్వహించి ధ్వజపటాన్ని ధ్వజస్తంభం నుంచి శాస్త్రోక్తంగా వేదమంత్రోచ్ఛరణల మధ్య కిందకు దించారు. శుక్రవారం రాత్రి శివరాత్రి రోజున వధూవరులైన స్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవ, శయనోత్సవ, ఏకాంతసేవలను నిర్వహిస్తామని ఈఓ సాగర్‌బాబు తెలిపారు.