విశాఖకు ఆధ్యాత్మిక మణిహారం
‘భువిపై భూతల స్వర్గంగా భాసిల్లుతున్న ఇస్కాన్ మందిరం సామాన్యుని సుందర స్వప్న సాకారంగా విరాజిల్లుతోంది. కలలో మాత్రమే చూడగల అపురూప కట్టడం నగరంలో నిర్మాణం కావడం విశాఖప్రజల అదృష్టం. సనాతన ధర్మానికి ప్రతిరూపంగా నిలిచిన కట్టడం స్మార్ట్‌సిటీ విశాఖాకే తలమానికంగా నిలువబోతుంది. అంతేకాదు పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖకుS అదనపు సొగసులు తెచ్చుకుంటోంది. అదే సమయంలో ఆధ్యాత్మికశోభను కూడా సంతరించుకోబోతుంది. –సాగర్‌నగర్
అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) విశాఖనగరశాఖ రూ.100కోట్లతో సాగరతీరాన (సాగర్‌నగర్)అద్భుత ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, పలు విశిష్టతలతో రూపుదిద్దుకుంటున్న ఈ ఆలయం మూడేళ్లలో అందుబాటులోకి రానుంది. సాగరతీరాన ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాఖ ఓ వైకుంఠ దేవాలయంగా తీర్చిదిద్దడానికి సన్నాహాలు చేస్తున్నారు. చైన్నైకి చెందిన స్థపతి పర్యవేక్షణలో నిర్మాణ కొనసాగుతున్న ఇస్కాన్ టెంపుల్ నిర్మాణం 2019కల్లా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రతినిధులు పనులు శరవేగంగా చేపడుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోని ఏ ఇస్కాన్ దేవాలయానికి లేని ఆధ్యాత్మిక హంగులు ఈ మందరంలో సమకూర్చుతున్నారు.
దేవతామూర్తుల సమాహారం
నాలుగు అంతస్తుల్లో ఆ«ధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. రాధాకష్ణులు ఇతర దేవతల్ని దర్శించుకుని..భక్తులు బయటకు వచ్చేటప్పుడు సుందర సాగరతీరం కనువిందు చేయనుంది. ఆలయంలో ఒక్కో అంతస్తుల్లో ఒక్కోరకమైన దేవతామూర్తులు కొలువుదీరే విధంగా నిర్మాణం చేపడుతున్నారు.
ప్రత్యేకతలు
–భారతీయ ఆధ్యాత్మిక విలువలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని అందించేందుకు దృశ్యశ్రవణ గ్రంథాలయాన్ని నిర్మిస్తున్నారు. దీనిని ఒకేసారి వందమంది వినియోగించుకోవచ్చు.
–నీటి అంతర్భాగంలో ఉండేలా అరుదైన ధ్యానకేంద్రాన్ని(అండర్ వాటర్ మెడిటేషన్ సెంటర్)ఇక్కడ నిర్మిస్తున్నారు. భక్తులు నీటి మధ్యలో కూర్చొని ధ్యానం చేసుకోవడానికి వీలుగా ఫైబర్‌తో నిర్మిస్తున్న ఈ ధ్యాన కేంద్రం సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఈ తరహా నిర్మాణం ఇప్పటివరకు ఏ ఇస్కాన్ దేవాలయంలోనూ లేదు.
–శ్రీకృష్ణుని జన్మవృత్తాంతాలు, కృష్ణలీలలు, అందరికీ అర్థ్ధమయ్యేలా 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక ప్రదర్శనశాలను నిర్మించనున్నారు.
–భక్తి ప్రదర్శనలు నిర్వహించడానికి కళాక్షేత్రంతోపాటు యాభై పడకల వృద్ధాశ్రామం, గోశాలను ఏర్పాటు చేయనున్నారు.
–ఇక్కడ స్పెషల్ ప్లానిటోరియం(ప్రత్యేక వైదిక నక్షత్రశాల)ను నిర్మిస్తున్నారు. సృష్టి నిర్మాణం, పునర్జన్మ తదితర అంశాలతోపాటు స్వర్గం, నరకం, దైవసాన్నిధ్యంలో ఉంటే ఎలాంటి శారీరక అనుభూతులు కలుగుతాయో ప్రత్యేక్షంగా అనుభవించగలిగేలా ఇస్కాన్‌కు చెందిన భక్తి వేదాంత పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు ఈ ప్లానిటోరియాన్ని నిర్మిస్తున్నారు.
–ఆధ్యాత్మిక భావాలు వెదజల్లే శ్రీరాధాపార్థసారథుల మనోహర విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు.
సుందర స్వప్న సాకారం ఇస్కాన్ మందిరం
ఇస్కాన్ మందిరం మనోహరమైన సుందర స్వప్నం. దేశంలోనే ఇస్కాన్ ఆలయాల్లో లేని విశిష్ట ఏర్పాట్లు, ప్రత్యేకతలు ఉండేలా తీర్చిదిద్దుతున్నాం. అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటకులను సైతం ఆకర్షించేలా అత్యున్నత స్థాయిలో నిర్మిస్తున్నాం. విశాఖనగరాన్ని ఆధ్యాత్మిక చింతనతో కలిగిఉండాలి, ప్రతిపౌరుడు దైవచింతనతో మెలగాలనేది మా సంకల్పం. చిన్నారులు, యువజనులు భారతీయ సాంప్రదాయాలు విడనాడకుండా సంస్కరణవంతమైన జ్ఞానాన్ని,భక్తిని ప్రబోధించడమే ఇస్కాన్ లక్షయం.
– నీతాయ్ సేవిని, ఇస్కాన్ నిర్వాహకురాలు
విశాఖను విశ్వవ్యాప్తంగా చూపించాలి
సుందరమైన సాగరానికి ఆనుకొని ఉన్న సాగరేశ్వరుని సాక్షిగా వైశాఖేశ్వరుని సంకల్పంతో ఆధ్యాత్మికంగా విశాఖను విశ్వవ్యాప్తంగా చూపించాలనేది మా ఆశయం. అకుంఠ దీక్ష, పట్టుదలతో ఆలయ నిర్మాణం చేపడుతున్నాం. దీని వెనుక వేలాది మంది స్థానిక భక్తజనం,దాతల సహకారం, సంకల్పమే ముందుకు తీసుకెళ్తోంది.
–సాంబదాస్ ప్రభుజీ, అధ్యక్షుడు ఇస్కాన్ విశాఖనగరశాఖ