ఇదేమి రాజ్యం...?!
అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం తుది దశకు చేరేసరికి ఆరోపణలు, ప్రత్యారోపణలు ఊపందుకున్నాయి. నిజానికి ఇదంతా మరో నాలుగైదు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న యుద్ధం. అందుకే, ప్రధాన ప్రత్యర్థి రాజకీయ పక్షాలు కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఎక్కడా తగ్గడంలేదు. అవతలి వారికి సంబంధించి వెల్లడయ్యే ఏ అంశాన్నీ వదలడంలేదు. ప్రత్యర్థిని ఖండఖండాలుగా తెగ్గోసి జనంలో పరువు తీయాలని, నిలువ నీడలేకుండా చేయాలని పోటీపడుతున్నాయి. ఈ చంపుడు పందెంలో ఇప్పటికైతే బీజేపీకి చావుదెబ్బ తగిలినట్టే కనిపిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్‌కు అందివచ్చిన అంశం చాలా చిత్రమైనది. డిటెక్టివ్ నవలల్లోని ఇతివృత్తాన్ని, ఇంకా చెప్పాలంటే నాజీ జర్మనీ కాలంనాటి ఉదంతాలనూ తలపింపజేసేది. 2009 ప్రాంతంలో గుజరాత్ వెళ్లిన ఒక యువతి గురించి, ఆమె కదలికలగురించి ఎప్పటికప్పుడు ఆరా తీయడానికి, ఆమెను అనుసరించడానికి అక్కడి ప్రభుత్వం తన యావత్తు భద్రతా యంత్రాంగాన్నీ మోహరించిన ఉదంతమిది.
ఇలా ఆమె కదలికలపై అనుక్షణం నిఘా పెట్టడానికి, ఆమె గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరేయడానికి ఉగ్రవాద నిరోధక దళం, ఇంటెలిజెన్స్, క్రైం బ్రాంచ్ విభాగాల సిబ్బందిని ఎందుకు వినియోగించారన్నది జవాబులేని ప్రశ్న. వెబ్ పోర్టల్స్ కోబ్రాపోస్ట్, గులైల్ వెల్లడించిన ఈ నిఘా వ్యవహారంలో పాత్రధారి వివాదాస్పద బీజేపీ నేత అమిత్ షా. చట్టవిరుద్ధంగా ఆయన సాగించిన ఈ నిఘా వ్యవహారంలో యువతి ఎవరన్నది ఆ పోర్టల్స్ బయటపెట్టలేదు. ఆమె బెంగళూరుకు చెందిన యవతిఅని, ఆర్కిటెక్ట్ అని మాత్రం చెబుతున్నాయి. ఈ నిఘా వ్యవహారం సాగించిన సమయంలో అమిత్ షా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జూనియర్ మంత్రి. యువతిపై నిఘాకు సంబంధించి సీనియర్ ఐపీఎస్ అధికారి జీఎల్ సింఘాల్‌తో మాట్లాడిన ప్రతిసారీ ‘సాహిబ్’ ఆదేశించారని, ‘సాహిబ్’ కోరుకుంటున్నారని అమిత్ షా చెప్పడం విశేషం. ఆ ‘సాహిబ్’ నరేంద్ర మోడీ కావొచ్చని సులభంగానే అర్ధమవుతుంది.
అందువల్లే ఇప్పుడు బీజేపీకి ఈ వివాదం ప్రాణాంతకంగా మారింది. సమర్థించుకోవడం సాధ్యంకాక ఆ పార్టీ తల్లకిందులవుతున్నది. ఒక యువతిపై నిఘా పెట్టడంలో తప్పేమీ లేదని చెప్పడానికి బీజేపీ వేస్తున్న పిల్లిమొగ్గలు ఆ పార్టీని జనంలో మరింత పలచనచేస్తున్నాయి. ఆ యువతి కుటుంబంతో నరేంద్ర మోడీకి సాన్నిహిత్యం ఉన్నదని, ఆ యువతి తండ్రే తన కుమార్తె భద్రతపై ఆందోళనచెంది రక్షణ కల్పించమన్నాడని బీజేపీ చెబుతోంది. పైగా, ఆ సంగతి ఆమెకు కూడా తెలుసునని వివరిస్తోంది. ఇందుకు సంబంధించి ఆమె తండ్రి రాసినట్టుగా చెబుతున్న రెండు లేఖల్ని కూడా మీడియాకు బీజేపీ పంపిణీచేసింది. ఆ లేఖలే బీజేపీ కపటత్వాన్ని బయటపెడుతున్నాయి. తన కుమార్తె గుజరాత్లో ఏమైపోతుందో నన్నంత భయం ఆమె తండ్రికి ఎందుకు కలిగినట్టు? ఒకవేళ ఆయనకు అలా అనిపించినా ఆ అభిప్రాయం తప్పని నరేంద్ర మోడీ ఎందుకు చెప్పలేకపోయినట్టు? అసలు రక్షణ కల్పించడానికి, నిఘా పెట్టడానికి మధ్య చాలా తేడా ఉంది. ఆమె తండ్రి రక్షణ అడిగితే నిఘా పెట్టడం దేనికి? ఆ యువతే ఈ నిఘాను కోరుకున్నదని మరో వాదన మొదలుపెట్టారు. ఆ యువతికి తాను ఎక్కడికెళ్తున్నానో, ఏం చేస్తున్నానో, ఎవరెవరితో మాట్లాడుతున్నానో తెలియనంత పరిస్థితి ఉందా? అలాంటప్పుడు ఆమెకు రక్షణకన్నా, నిఘాకన్నా వైద్యుల అవసరం ఎక్కువున్నట్టు లెక్క. ఆమె కోసమని డజన్లమంది పోలీసులను తరలించేముందు ఆమె భద్రతకు ఏర్పడిన ముప్పేమిటో, అది ఏ స్థాయిలో ఉన్నదో మదింపువేశారా? ఇందులో ఏ ప్రశ్నకూ బీజేపీ వద్ద జవాబులేదు. తమ ఇష్టప్రకారమే జరిగింది గనుక, ఆమె వివాహమై ప్రశాంతంగా ఉంటున్నది గనుక ఈ వివాదానికి స్వస్తి పలకాలని ఆ తండ్రి కోరుతున్నాడని... కనుక ఇక ఎవరూ మాట్లాడటానికి లేదని చెబుతోంది. పౌరులపై చట్టవిరుద్ధంగా నిఘా పెట్టడం, వారిని వెన్నాడటం నేరపూరిత చర్యలు. పౌరహక్కులకు భంగం కలిగించే చర్యలు. బాధిత పౌరులు నేరస్తులను క్షమించామని చెప్పినంత మాత్రాన కేసు రద్దు కాదు. ఈ సూక్ష్మ విషయాన్ని కూడా బీజేపీ దిగ్గజాలు మరిచిపోతున్నాయి.
పద్దెనిమిదేళ్లు నిండిన యువతీయువకులెవరైనా మన చట్టాల ప్రకారం, రాజ్యాంగం ప్రకారం స్వతంత్ర పౌరులు. ఆ వయస్సు దాటాక వారిపై నిఘా ఉంచమని చెప్పడానికి, తగిన కట్టుదిట్టాలు చేయమని చెప్పడానికి తల్లిదండ్రులకు సైతం హక్కుండదు. తండ్రి అడిగిన ప్రకారం చేశామని, ఆయనే మాట్లాడ వద్దంటున్నాడు గనుక ఇక ఆ ఊసెత్తవద్దని చెప్పడం మొరటుతనం అవుతుంది. ఈ వాదనను పాతికేళ్ల క్రితం చేసివుంటే బీజేపీ పెద్దల్ని ఎవరైనా క్షమించేవారేమో! పాలనలో ప్రవేశం లేదు గనుక అపరిపక్వతతో మాట్లాడారని సరిపెట్టుకునేవారేమో! కానీ, చదవేస్తే ఉన్నమతి పోయినట్టు అధికార పక్షంగానూ, ప్రతిపక్షంగానూ ఇంత అనుభవం గడించాక బీజేపీ ఇలాంటి వాదనలకు దిగుతోంది. ఇటు కాంగ్రెస్ తీరూ ప్రశ్నార్ధకమే. 2009నాటి ఈ వ్యవహారం కోబ్రాపోస్టు బయటపెడితే తప్ప కేంద్ర ప్రభుత్వానికి తెలియదని అనుకోలేం. అమిత్ షాకు అప్పట్లో చేదోడువాదోడుగా ఉండి, నిఘా వ్యవహారాన్ని నడిపించిన సింఘాలే ఇందుకు సంబంధించిన ఫోన్ రికార్డులను సీబీఐకి చాలాకాలం క్రితం అందజేశాడు. నిజంగా నిజాయితీ ఉంటే యూపీఏ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించి దర్యాప్తునకు ఆదేశించేది. బాధ్యులపై కేసులు నడిపేది. కానీ, ఎన్నికల ప్రచార సమయంలో దీన్ని తురుపు ముక్కగా వాడుకుని ప్రత్యర్థి పక్షాన్ని దెబ్బతీయొచ్చునని భావించి ఇన్నాళ్లూ మౌనంగా ఉండిపోయింది. మన జాతీయోద్యమం తెచ్చిన విలువలపైగానీ, ఆ విలువలను పొదువుకున్న రాజ్యాంగంపైగానీ ఇరుపక్షాలకూ లేశమంత కూడా విశ్వాసం లేదని ఈ ఉదంతం నిరూపిస్తోంది.