జైరాం దిష్టిబొమ్మ దహనం
సాక్షి, ముంబై: తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి జైరాం రమేశ్ ప్రకటనను నిరసిస్తూ మంగళవారం సాయంత్రం ధారావిలోని సాహునగర్‌లో పలు తెలంగాణ సంఘాలు ఆయన దిష్టి బొమ్మను దహనం చేశాయి. ఈ కార్యక్రమంలో ధారావిలోని తెలంగాణ తెలుగు ప్రజా సంఘం, ముంబై ఉద్యమ సంఘీభావ వేదిక, వడాల తెలుగు సంఘం, వడాల కోలివాడ ఎస్సీ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ భద్రాచలం.. తెలంగాణలో భాగమేనన్నారు.
భద్రాచలం పరిసర మండలాలను సీమాంధ్రలో కలపడాన్ని తీవ్రంగా ఖండించారు. యూపీఏ ప్రభుత్వం సీమాంధ్ర ప్రయోజనాల రక్షణ పేరిట తెలంగాణ ప్రజల గొంతు కోయడం దారుణమని దుయ్యబట్టారు. ఓటు బ్యాంకు రాజకీయలకు పోలవరం ప్రాజెక్టు చేపడితే ఖమ్మం జిల్లా తెలంగాణకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుందన్నారు. అందువల్ల దీనిని పునరాలోచించాలంటూ వక్తలు హెచ్చరించారు. ఈ కార్యక్రమమంలోగుడుగుంట్ల వెంకటేశ్‌గౌడ్, ఆవుల రాములు, నరిగే సైదులు, బత్తుల శంకర్, వల్లాల రాజయ్య, కక్కిరేణి వెంకన్న, గుండిపోయిన యాదయ్య, ఎల్లబోయిన యాదయ్య, గద్దిపాటి మారయ్య, కె.రాములు, గద్దిపాటి దశరథ్, సూరారపు వెంకన్న, చింత. లతీఫ్ పాల్గొన్నారు.