ఇదీ పోలీస్ వసూల్ రాజాల జాబితా
ఎంతో కాలంగా పోలీస్ వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతి డొంక కదిలింది. శాఖలో ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ దాకా వసూళ్లకు పాల్పడుతున్న వారి జాబితాను డీజీపీ కార్యాలయం ప్రకటించింది. వీరిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది.
ఇదీ వసూల్ రాజాల జాబితా
సైబరాబాద్: 13 మంది
రాచకొండ: 24 మంది
హోంగార్డులు: 6
కానిస్టేబుళ్లు: 24
హెడ్–కానిస్టేబుళ్లు: 6
ఏఎస్సై: 1
భువనగిరి ఏసీపీకి ఆరుగురు ‘కలెక్టర్లు’
సాక్షి, సిటీబ్యూరో: కలెక్టర్... పోలీసు విభాగంలోనూ అనధికారికంగా ఈ పోస్టు ఉంటుంది. సబ్–ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, ఏసీపీలకు నెల వారీ, కొన్ని ప్రత్యేక కేసుల్లో మామూళ్లు కలెక్ట్ చేసి ఇవ్వడం ఇతడి బాధ్యత. సాధారణంగా హోంగార్డు, కానిస్టేబుల్ స్థాయి అధికారులే కలెక్టర్లుగా ఉంటుంటారు. అయితేనేం... ఆ ఠాణా, డివిజన్లో అతడే పవర్ఫుల్. షాడో ఇన్స్పెక్టర్, ఏసీపీలుగా వ్యవహరిస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ వసూల్‌రాజాల జాబితాను డీజీపీ కార్యాలయం రూపొందించింది. ఇందులో సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో పని చేస్తున్న వారు 37 మంది ఉన్నారు. ఆరుగురు కలెక్టర్లను ఏర్పాటు చేసుకున్న భువనగిరి ఏసీపీ జితేందర్‌రెడ్డి వసూళ్ల పర్వంలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు డీజీపీ కార్యాలయం తయారు చేసిన జాబితా స్పష్టం చేస్తోంది.
సిటీ టు స్టేట్..
ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి 2014లో రాష్ట్ర అవతరించిన తర్వాత హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆపై ఏడాదిలోపే అవినీతి నిరోధక చర్యలు ప్రారంభించిన ఆయన సిటీలో ఉన్న వసూల్ రాజాలపై దృష్టి పెట్టారు. స్పెషల్ బ్రాంచ్ ద్వారా లోతుగా ఆరా తీయించి, దాదాపు 100 మందితో కూడిన జాబితాను రూపొందించారు. వీరిని సిటీ ఆరడ్మ్ రిజర్వ్ విభాగానికి బదిలీ చేయించారు. ఇప్పుడు డీజీపీగా మహేందర్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో ఉన్న కలెక్టర్లపై ఆరా తీయాల్సిందిగా నిఘా విభాగాన్ని ఆదేశించారు. దాదాపు రెండు నెలల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టిన ఇంటెలిజెన్స్ వింగ్ 391 మందితో కూడిన జాబితాను రూపొందించి గత నెల 23న డీజీపీకి సమర్పించింది.
అగ్రస్థానంలో జితేందర్‌రెడ్డి...
ఈ 391 మందిలో సైబరాబాద్‌కు చెందిన వారు 13 మంది, రాచకొండ కమిషనరేట్లలో పని చేస్తున్న వారు 24 మంది ఉన్నారు. వీరిలో హోంగార్డు నుంచి అసిస్టెంట్ సబ్–ఇన్స్పెక్టర్ వరకు వివిధ హోదాలకు చెందిన అధికారులు ఉన్నారు. భువనగిరి ఏసీపీ ఎం.జితేందర్‌రెడ్డి ఏకంగా ఆరుగురు కలెక్టర్లను ఏర్పాటు చేసుకుని రెండు కమిషనరేట్లలోనూ అగ్రస్థానంలో నిలిచారు. ఈయన తన డ్రైవర్‌గా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్‌తో పాటు బి.రామారంలో ఇద్దరు, భువనగిరి టౌన్లో ఇద్దరు, బీబీనగర్‌లో ఒకరు కలెక్టర్లను ఏర్పాటు చేసుకున్నారు. చౌదరిగూడెం ఇన్స్పెక్టర్ లింగం ఏకంగా ఏఎస్సై స్థాయి అధికారినే వసూల్ రాజాగా మార్చుకున్నారు. దుండిగల్, జీడిమెట్ల ఇన్స్పెక్టర్లకు ముగ్గురు చొప్పున, షాద్‌నగర్, పహాడీషరీఫ్, భువనగిరి, బీబీనగర్, వలిగొండ, యాదగిరిగుట్ట రూరల్, మల్కాజ్గిరి ఇన్స్పెక్టర్లకు ఇద్దరు చొప్పున కలెక్టర్లు ఉన్నారు.
చేయించిన వారిపై చర్యలేవీ?
ఈ కలెక్టర్లు అంతా ప్రధానంగా రెస్టారెంట్లు, బార్స్, వైన్‌షాపులు, పబ్స్ తదితర వ్యాపార సంస్థల నుంచి నెలవారీ, కొన్ని కేసుల్లో బాధితులు, నిందితులతో పాటు వారి సంబం«ధీకుల నుంచి మామూళ్లు వసూలు చేస్తుంటారు. జాబితాను అన్ని జిల్లాల ఎస్పీలకు, పోలీసు కమిషనరేట్ల కమిషనర్లకు ఈ–మెయిల్ రూపంలో పంపించిన డీజీపీ వసూల్ రాజాలను ఏఆర్ విభాగానికి బదిలీ/ఎటాచ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అయితే వసూలు చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తూ వసూలు చేయించిన వారిని విస్మరించడం ఎంత వరకు న్యాయమని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా వ్యవహరించే సదరు పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్/ఎస్సై లేదా డివిజన్ ఏసీపీలు/డీఎస్పీల ఆదేశాల మేరకే, వారికోసమే వసూళ్లు జరుగుతాయని, అందులో కలెక్టర్లకూ కొంత మొత్తం ముడుతుందని చెప్తున్నారు. నేరం చేసిన వారిపై వేటు వేస్తున్న ఉన్నతాధికారులు దానికి ప్రేరేపించిన వారిని వదిలేయడం ఏమిటని అంటున్నారు. కలెక్టర్లను నియమించుకున్న వారి పైనా చర్యలు తీసుకోవాలని, అప్పుడే సమస్య పునరావృతం కాకుండా ఉంటుందని పేర్కొంటున్నారు.
మామూళ్లు అడిగితే ఫిర్యాదు చేయండి
తమ కమిషనరేట్ పరిధిలో ఎవరైనా మామూళ్ళు అడిగితే నేరుగా తనకే ఫిర్యాదు చేయాలని హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు అంజనీ కుమార్, వీసీ సజ్జనార్ గురువారం కోరారు. హోటళ్ళు, రెస్టారెంట్స్, వైన్ షాపులు, బార్స్, లాడ్జిలు, పబ్స్, ఇతర వ్యాపార సంస్థలు, గేమింగ్ జోన్స్, పార్లర్స్, కేఫ్‌లు తదితరాలు నిబంధనలకు అనుగుణంగానే పని చేయాలని స్పష్టం చేశారు. అలా కాకుంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయా సంస్థల వద్ద ఎవరైనా పోలీసులు మామూళ్ళు డిమాండ్ చేస్తే హైదరాబాద్ పరిధికి చెందిన వారు 9490616555, సైబరాబాద్ వారు 9490617444 నెంబర్లకు వాట్సాప్ ద్వారా, లేదా హైదరాబాద్‌కు చెందిన వారు (cphydts@gmail. com), సైబరాబాద్వారు(cpcybd@gmail.com)కు ఈ–మెయిల్ చేయడం ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ మేరకు గురువారం ఇరువురు కమిషనర్లు ప్రకటనలు విడుదల చేశారు.