సాక్షి, సిటీబ్యూరో : కేవలం 26 ఏళ్ల వయస్సుకే హర్యానా, రాజస్థాన్, పంజాబ్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఘరానా గ్యాంగ్‌స్టర్ సంపత్ నెహ్రా సైబరాబాద్ పరిధిలో చిక్కాడు. హర్యానా నుంచి వచ్చిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) అధికారులు మాదాపూర్ జోన్ ఎస్వోటీ సహకారంతో బుధవారం అతడిని పట్టుకున్నారు. స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై హర్యానాకు తరలించినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ గురువారం తెలిపారు. రాజస్థాన్‌లోని కలోడి ప్రాంతానికి చెందిన సంపత్ చండీఘడ్‌లో స్థిరపడ్డాడు. పంజాబ్ యూనివర్శిటీ పరిధిలోని డీఏవీ కాలేజీలో బీఏ చదివిన అతను వర్శిటీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు అనుచరుడిగా పని చేశాడు. బిష్ణోయ్‌ని పోలీసులు అరెస్టు చేయడంతో తానే ఓ గ్యాంగ్‌స్టర్‌గా మారాడు. యువత, విద్యార్థులతో భారీ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్న సంపత్ తన సామ్రాజ్యాన్ని హర్యానాతో పాటు పంజాబ్, రాజస్థాన్‌లకూ విస్తరించాడు. వరుస నేరాలు చేస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ మూడు రాష్ట్రాల పోలీసులకు సవాల్ విసిరాడు. పది సంచలనాత్మక హత్యలు, మూడు హత్యాయత్నాలతో పాటు బెదిరింపులు, దోపిడీల కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. ప్రతి నేరంలోనూ తుపాకీ వినియోగించిన సంపత్ డబుల్ హ్యాండ్ షూటర్. తన రెండు చేతులతోనూ ఏక కాలంలో తుపాకీ పేల్చగలడు. హర్యానాలోని పంచకుల ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న తన అనుచరుడు దీపక్ అలియాస్ టింకును వినిపించడానికి అతను పోలీసుల పైనే తుపాకీ ఎక్కుపెట్టాడు. ఎ
స్కార్ట్ అధికారుల కళ్లల్లో కారం చల్లడంతో పాటు కాల్పులు జరిపి తన అనుచరుడిని తప్పించాడు. రాజస్థాన్‌లోని రాజ్‌ఘర్ కోర్టు ఆవరణలో అజయ్ అనే ప్రత్యర్థిపై కాల్పులు జరిపిన సంపత్ అతడిని హత్య చేశాడు. మూడు రాష్ట్రాల్లోనూ ఇతడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. దీంతో చండీఘర్‌కు పారిపోయిన సంపత్ అక్కడి ఖోర్బా ప్రాంతంలో తలదాచుకున్నాడు. దాదాపు 20 రోజుల క్రితం మియాపూర్‌కు వచ్చిన అతడు గోకుల్‌ప్లాట్స్‌లో ఓ అద్దె ఇంట్లో మకాం పెట్టాడు. ఇతడి కదలికలను గుర్తించిన ఎస్టీఎఫ్ అధికారులు సైబరాబాద్‌కు చేరుకున్నారు. బుధవారం ఎస్వోటీ సాయంతో సంపత్‌ను పట్టుకుని తీసుకువెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment