షీలాపై చర్యలు తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలోని అనధికారిక కాలనీల్లో నివసిస్తున్న 50 లక్షల మంది ప్రజలను తప్పుడు వాగ్దానాలతో మోసగిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై చర్యలు తీసుకునేలా ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, హోంమంత్రి షిండేలను ఆదేశించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖలో బీజేపీ నేతలు కోరారు. ఢిల్లీ విధానసభ ఎన్నికల బీజేపీ సీఎం అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్, బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్, విధానసభ ప్రతిపక్ష నాయకుడు విజయ్‌కుమార్ మల్హోత్రా సంయుక్తంగా ఈ లేఖను రాశారు. ఈ సందర్భంగా వారు గురువారం మీడియాతో మాట్లాడారు.
అనధికారిక కాలనీలను క్రమబద్దీకరిస్తామని చెప్పిన షీలాదీక్షిత్.. 2008లో 50 లక్షల మంది అనధికారిక కాలనీవాసులకు కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేతులమీదుగా సర్టిఫికెట్లను ఇప్పించారని పేర్కొన్నారు. అనధికారిక కాలనీల్లో మౌలిక వసతులు కల్పించకుండా వాటిని క్రమబద్దీకరించడానికి వీలులేదంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును తెలిసీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసగించార ని ఆరోపించారు. ఈ అంశంపై లోకాయుక్తాకు ఫిర్యాదు చేసినట్టు హర్షవర్ధన్ తెలిపారు. లోకాయుక్త 2010లో దీనిపై విచారణ జరిపిందన్నారు. సీఎం ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు లక్షల రూపాయల ప్రజాధనాన్ని దినపత్రికలు, టీవీ చానళ్లలో ప్రకటలు ఇచ్చేం దుకు వినియోగించినట్టు నిగ్గుతేల్చిందన్నారు. ప్రతిమారు ఎన్నికల సమయం లో అనధికారిక కాలనీల్లోని 50 లక్షల ఓట్లను కొల్లగొట్టేందుకు షీలా తప్పుడు వాగ్దానాలు చేస్తూనే ఉన్నారని, ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.