ములాయం తలవంచేది ఎవరికో తెలుసా?
సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభంలో ఎవరి పట్టు వారిదే. బాబాయ్ శివపాల్ యాదవ్‌ను మంత్రివర్గం నుంచి తీసేస్తున్నట్లు అఖిలేష్ ఏకపకక్షంగా ప్రకటించారు. అఖిలేష్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అంతే ఏకపక్షంగా ములాయం తీసేశారు. కానీ.. వీళ్లందరూ తల వంచేది మాత్రం ఒక్కరి ముందే. ఆయనెవరో తెలుసా.. ఆఫ్టరాల్ ఒక పంచాయతీ పెద్దమనిషి. అలాగని ఆయన్ను ఆఫ్టరాల్‌గా తీసి పారేయడానికి ఏమాత్రం లేదు. ములాయం సొంత ఊరైన సైఫై గ్రామానికి ఆయనే పెద్ద. తన కుటుంబ వ్యవహారాల్లో బయటి వ్యక్తులెవర్ని మధ్యలో తలదూర్చనివ్వని సమాజ్‌వాద్ పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ మాత్రం దర్శన్ సింగ్ యాదవ్‌కు చాలా ప్రాముఖ్యం ఇచ్చారు. దర్శన్ సింగ్ కేవలం ఓ సాధారణ వ్యక్తి మాత్రమే కాదట.
నేతాజీ స్వస్థలం ఇటావా జిల్లా సైఫై గ్రామానికి అతనే ప్రధానమంత్రి. గత సోమవారం ములాయం, తమ్ముడు శివపాల్, కొడుకు అఖిలేష్లతో పాటు దర్శన్ సింగ్ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఫిబ్రవరి-మార్చిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కొట్లాటలు అధికార పార్టీకి అంతమంచిది కాదని సర్దిచెప్పి దర్శన్ వారిని ఇంటికి పంపారు. ఈ సమావేశనంతరం అఖిలేష్ కూడా తమ ప్రధాన్జీతో భేటీ అయిన విషయాన్ని ఎంతో గర్వంగా పార్టీ శాసనసభ్యులకు చెప్పుకున్నారు. అసలు దర్శన్‌కు ములాయం ఎందుకంత ప్రాముఖ్యమిస్తారంటే ఒకింత ఆశ్చర్యమే.
తన రాజకీయాలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ములాయం ఓ షెడ్యూల్ కులాల వ్యక్తి ఇచ్చిన మంచినీళ్లు తాగినందుకు గ్రామస్తులందరూ నేతాజీని కొట్టడానికి ముందుకు వచ్చారట. అప్పుడు ములాయంను ఆయనే కాపాడారు. ములాయం వండిన బంగాళదుంప కూరను తిని, ఇప్పుడు నేను కూడా అంతే నేరాన్ని చేశాను. నన్ను కూడా శిక్షించండంటూ ముందుకు వెళ్లాడట. దీంతో గ్రామస్తులందరూ వెనక్కి తగ్గారు. అప్పటినుంచి సైఫై గ్రామానికి దర్శన్ ప్రధాన్‌గా ఉన్నారు. ఈ విషయాలన్నింటినీ చూస్తుంటే ఇప్పటికీ యూపీలో ఏమేరకు గ్రామ పెద్దల హవా నడుస్తుందో అర్థమవుతోంది.
ఈ విషయంపై దర్శన్‌ను సంప్రదించగా.. ఇవి కేవలం రాజకీయ కొట్లాటలేనని, తకు ఏది మంచి అనిపించిందో అది వారికి సర్ది చెప్పిపంపానని, త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని అన్నారు. మరోవైపు ములాయం ఇంట ఇంతపెద్ద గొడవ జరుగుతున్నా.. ములాయం అన్న మాత్రం తనకేమీ తెలియదన్నట్లే ఉన్నారు. భూదాన్ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ తండ్రి, ములాయం పెద్దన్న అభయ్ రామ్ యాదవ్‌ను ప్రశ్నిస్తే, ''వ్యవసాయంలో ఏమన్నా సందేహాలుంటే నన్ను అడగండి కానీ లక్నోలో ఏం జరుగుతుందో నాకేమీ తెలియదు'' అని తేల్చేశారు.