తైముర్ అలీ వన్
తైముర్ అలీఖాన్ కదా.. తైముర్ అలీ వన్ అంటారేంటి అనుకుంటున్నారా? సైఫ్ అలీఖాన్–కరీనా కపూర్ల ముద్దుల తనయుడు తైముర్ అలీఖాన్ వన్ ఇయర్ బర్త్‌డే బుధవారం జరిగింది. అందుకే తైముర్ వన్ అన్నాం. ఇప్పుడు బీ టౌన్ స్టార్ కిడ్స్‌లో సెన్సేషన్ తైముర్. ఎయిర్‌పోర్ట్‌లో, హోటల్లో, ఇలా ఎక్కడ కనిపించినా మీడియాను తనవైపు తిప్పుకుంటున్నాడీ బుజ్జిగాడు. తనయుడి బర్త్‌డేని సైఫ్–కరీనా కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిపారు. బర్త్‌డే గిఫ్ట్‌లు చాలా వచ్చినప్పటికీ ఒక్క గిఫ్ట్ మాత్రం మనందర్నీ ఆశ్చర్యపరచకమానదు. బాలీవుడ్ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ ఏకంగా ఒక అడవినే గిఫ్ట్‌గా ఇచ్చారు.
మీరు విన్నది నిజమే. ‘తైముర్ అలీఖాన్ పటౌడి ఫారెస్ట్’ అని పేరు కూడా పెట్టారు. ‘‘కొన్ని పక్షులు ఇప్పటికే కనుమరుగయ్యాయి. తేనెటీగలు, సీతాకోక చిలుకలు వంటవి కూడా మాయమయ్యే ప్రమాదం ఉంది. తైముర్‌కి ఇవి తెలియాలని ఈ చిట్టి అడవిని బహుమతిగా ఇచ్చా’’ అని రుజుతా పేర్కొన్నారు. వెయ్యి చెదరపు అడుగుల్లో సుమారు వందకి పైగా మొక్కలను నాటారు. విశేషం ఏంటంటే అందులో సగానికి పైగా చెట్లు తైముర్ వయస్సువి. కొన్ని చెట్లు తైముర్ కంటే చిన్నవి. జామ, అరటి, ఉసిరి, పనస, మిర్చి, సీతాఫలం, వంటి రకరకాల మొక్కలతో నిండిపోయింది ఈ ఫారెస్ట్.