నేటి నుంచి శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం
హన్మకొండ కల్చరల్ : భద్రకాళి దేవాలయంలో శాకంబరీ నవరాత్రోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం 5 గంటలకు భద్రకాళి అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించిన అనంతరం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారని ఆలయ ఈఓ రాముల సునీత తెలిపారు. అనంతరం ఉత్సవానుజ్ఞా, ప్రార్ధన, ఉదయం 7 గంటల నుంచి గౌరిగణపతి పూజ, చతుఃస్థానార్చన పూజలు జరుగుతాయని తెలిపారు. భక్తులు చూడటానికి ఎదురుచూసే అమ్మవారి సహస్ర కలశాభిషేకం ఉదయం 10గంటలకు నిర్వహించనున్నామని తెలిపారు.
మండల రచన..
శుక్రవారం ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు పర్యవేక్షణలో సహస్ర కలశాభిషేకంలో ఉపయోగించే వేయి మృత్తికా ఘటాలకు రంగులు వేశారు. యాగశాలలో యజ్ఞగుండాన్ని సిద్ధం చేశారు. సాయంత్రం 7గంటలకు శ్రీభద్రకాళి దేవాలయ ఆస్థాన విశ్వకర్మ విద్వాన్ సీహెచ్ శ్రీధర్ దేవాలయ స్వపనమందిరం ఉత్తరభాగంలో ఎరుపు, పసుపు, నారింజ, తెలుపు రంగులలో సర్వాంగ సుందరంగా మండలరచన గావించారు.
రోజువారీ కార్యక్రమాలు..
శాకంబరీ ఉత్సవాలలో శనివారం నుంచి ప్రతిరోజు అమ్మవారిని గజమాలలతో అలంకరిస్తూ వివిధ కాళీక్రమాలలో ఆరాధిస్తారు. ప్రతిక్రమానికి ప్రత్యేకత ఉంటుంది. నేటినుంచి జూలై 27 వరకు జరిగే శాకంబరీ పూజలలో భాగంగా శనివారం ఉదయం కాళీక్రమంలో మరియు కామేశ్వరీ నిత్యాక్రమంలో, సాయంత్రం కపాలినీక్రమం, భగమాలినీక్రమం, 15న ఉదయం కుల్లాక్రమం, సాయంత్రం నిత్యక్లిన్నాక్రమం, 16న కురుకుల్లాక్రమం, సాయంత్రం భేరుండాక్రమం, 17న విరోధినీక్రమం, సాయంత్రం వహ్నివాసినీ క్రమం, 18న విప్రచిత్తాక్రమం, సాయంత్రం మహావజ్రేశ్వరీక్రమం, 19న ఉదయం ఉగ్రాక్రమం, సాయంత్రం శివదూతీక్రమం, 20న ఉదయం ఉగ్రాప్రభాక్రమం, సాయంత్రం త్వరితాక్రమం, 21న ఉదయం దీప్తాక్రమం, సాయంత్రం కులసుందరీక్రమం, 22న ఉదయం నీలాక్రమం, సాయంత్రం నిత్యాక్రమం, 23న ఘనాక్రమం, సాయంత్రం నీలపతాకా క్రమం, 24న బలాకాక్రమం, సాయంత్రం విజయాక్రమం, 25న ఉదయం మాత్రాక్రమం, సాయంత్రం సర్వమంగళాక్రమం, 26న ఉదయం ముద్రాక్రమం, సాయంత్రం జ్వాలామాలినీక్రమం, 27న ఉదయం మితాక్రమం, సాయంత్రం చిత్రానిత్యాక్రమాలలో పూజలు నిర్వహించనున్నారు.