విజయవాడ: శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలో ఉత్సవ మూర్తులను ప్రతిష్టించి పూజా కార్యక్రమాలతో అర్చక స్వాములు ఉత్సవాలను ప్రారంభించారు. గర్భగుడిలోని అమ్మవారి విగ్రహానికి, ఉత్సవ విగ్రహానికి చిక్కుడు, దొండ, బెండకాయలు, యాలకులు, జీడిపప్పులతో అలంకరించారు. ఉదయం 4 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.
దర్శనానంతరం భక్తులకు కూరగాయలతో రూపొందించిన కదంబం ప్రసాదాన్ని అందజేస్తారు. ఉత్సవాల ముగింపు రోజైన శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో నర్సింగరావు పాల్గొన్నారు.