sakshi sing
-
నా ప్రేమ కథ
మహిధర్, సాక్షీసింగ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘నా లవ్ స్టోరీ’. శివ గంగాధర్ దర్శకత్వంలో జి. లక్ష్మి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 29న విడుదలవుతోంది. వేదనివాన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ప్రముఖ రచయితలు శివశక్తి దత్త, భువనచంద్ర విడుదల చేసారు. దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రం ట్రైలర్‌ని లాంచ్ చేశారు. దర్శకులు ప్రవీణ్ సత్తారు, సి.ఉమా మహేశ్వరరావు, రచయిత భారతీబాబు, ఆదిత్యా మ్యూజిక్ నిరంజన్ ఒక్కో పాటని విడుదల చేశారు. శివ గంగాధర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకు హీరో ఫాదర్‌గా చేసిన తోటపల్లిమధు, హీరోయిన్ ఫాదర్‌గా చేసిన శివన్నారాయణ, మహిధర్, సాక్షీసింగ్ నాలుగు పిల్లర్లు. ఈ నలుగురి మధ్యలో జరిగే కథే చిత్రం. గేటెడ్ కమ్యూనిటీ బ్యాక్ డ్రాప్లో ఒక అందమైన ప్రేమకథను చెప్పాం. పైరసీ ఇండస్ట్రీని నాశనం చేస్తుంది. సినిమా తీయాలంటే భయపడే పరిస్థితికి తెచ్చింది. దయచేసి పైరసీ చేయకండి’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. అవుట్ పుట్ చూశాక చాలా నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు మహిధర్. సాక్షీసింగ్, వేదనివాన్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కిరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కె. శేషగిరిరావు. -
సాక్షి ‘కర్మ సిద్ధాంతం’
పుణే: ఐపీఎల్లో ధోనిని కెప్టెన్సీ నుంచి తొలగించి ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్న రైజింగ్ పుణే సూపర్ జెయింట్ యాజమాన్యం ఆ తర్వాత అతని బ్యాటింగ్‌ను కూడా విమర్శించింది. అయితే జట్టులో సభ్యుడిగా ఉన్న ధోని నుంచి దీనిపై ఎలాంటి స్పందన లేకపోయినా ధోని సతీమణి సాక్షి సింగ్ మాత్రం తన అసంతృప్తిని దాచుకోలేకపోయింది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ట్వీట్ల ద్వారా ఆమె తన అసహనాన్ని ప్రదర్శించింది. తన వ్యాఖ్యలతో నేరుగా కాకపోయినా పరోక్షంగా పుణే మేనేజ్మెంట్కు గురి పెట్టింది. ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు హెల్మెట్ ధరించి ఫొటోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసిన సాక్షి ఆ జట్టుపై అభిమానాన్ని చాటుకుంది. ఎనిమిదేళ్ల పాటు ఐపీఎల్లో చెన్నై టీమ్ కెప్టెన్‌గా ధోని అనుభవించిన వైభవం గురించి అందరికీ తెలిసిందే. తన రెండో ట్వీట్లో సాక్షి పరిస్థితులు మారినంత మాత్రాన ఎవరినీ తక్కువగా చూడరాదంటూ కర్మ సిద్ధాంతాన్ని ప్రవచించింది. ‘పక్షి బతికి ఉన్నప్పుడు చీమలను తింటుంది. కానీ అది చనిపోయాక చీమలే దానిని తింటాయి. సమయం, పరిస్థితులు ఎప్పుడైనా మారిపోవచ్చు. జీవితంలో ఎవరినీ తక్కువ చేసి చూడవద్దు. ఎవరినీ బాధ పెట్టవద్దు. ఈ రోజు నువ్వు బలవంతుడివే కావచ్చు. కానీ సమయం అంతకంటే బలమైంది. ఒక చెట్టు నుంచి లక్షల సంఖ్యలో అగ్గి పుల్లలు తయారు చేయవచ్చు కానీ ఒక్క అగ్గిపుల్లతో లక్షలాది చెట్లను కాల్చవచ్చు. కాబట్టి మంచిగా ఉండండి. మంచిగా వ్యవహరించండి’ అని సాక్షి రాసింది!