ఆ కస్టమర్లకు ఐసీఐసీఐ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: పండుగ సీజన్ లో దిగ్గజ బ్యాంకులు ఖాతాదారులకు బంపర్ ఆఫర్ లను ప్రకటిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ మేజర్ ఎస్బీఐ హోంలోన్ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తే ప్రయివేటు బ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ నెలవారీ వేతనం పొందే ఉద్యోగులకు మరో ఆఫర్ ప్రకకటించింది. సాలరీడ్ కస్టమర్ల కోసం ఓవర్ డ్రాఫ్ట్ , టర్మ్ లోను పేరుతో రెండు ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంత కావాలంటే అంత, ఎప్పుడు కావాలంటే అప్పుడు తక్షణ అవసరాల కోసం టర్మ్ లోన్, పెళ్లి, విద్య, వైద్యఖర్చులు, విదేశీ ప్రయాణం తదితర వ్యక్తిగత అత్యవసర ఖర్చులు నిమిత్తం ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కింద నగదు పొందవచ్చని బ్యాంక్ తెలిపింది. ఈ తాజా ఆఫర్ లో ఖాతాదారులు ఆస్తుల తనఖా ద్వారా 5 లక్షలనుంచి కోటి రూపాయల వరకు రుణం పొందవచ్చు. మొత్తం అమౌంట్ లో కనీసం 10 శాతం టర్మ్ లోనుగాను, గరిష్టంగా 90 శాతం ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు పేర్కొంది. టర్మ్ లోన్ తీసుకుంటే వడ్డీ నెలవారీగా చెల్లించాల్సి ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్ లో అయితే రుణం తీసుకున్న సొమ్ము, రోజులు ఆధారంగా వడ్డీ వసూలు చేస్తారు. అదేవిధంగా, రివర్స్ స్వీప్ సౌకర్యం కూడా అందుబాటులోఉందని బ్యాంక్ తెలిపింది. సేవింగ్స్ ఖాతాలో అందుబాటులో వున్న అదనపు నిధులను ఓవర్డ్రాఫ్ట్ ఖాతాలోకి జమచేయనున్నట్టు పేర్కొంది. ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని ఉద్యోగస్తుని సేవింగ్స్ ఖాతాకు లింక్ చేస్తారు.
అంతేకాదు చాలాసులువుగా వీటిని ఆఫర్ చేస్తున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. దీంతో వారు వాడుతున్న ఖాతానుంచే అవసరమైన సందర్భాల్లో కావాల్సిన సొమ్మును స్వీకరించవచ్చన్నమాట. అలాగే తమ దగ్గర హోం లోన్ లేని ఉద్యోగులు ముఖ్యంగా కార్పొరేట్ రుణగ్రహీతలు కావాలంటే.. తమ ఖాతాను బదిలీ చేసుకోవచ్చని కూడా సూచించింది.