రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లకు జీతాల పెంపు?
భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల జీతం త్వరలోనే దాదాపు మూడురెట్ల వరకు పెరగనుంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుతం రాష్ట్రపతి జీతం దేశంలో అత్యున్నత అధికారి అయిన కేబినెట్ కార్యదర్శి జీతం కంటే కూడా లక్ష రూపాయలు తక్కువగా ఉంది. దీనిపై ఏడో వేతన సంఘం కొన్ని సిఫార్సులు చేసింది. వాటికి అనుగుణంగానే హోం శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ఈ ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రపతికి నెలకు రూ. 1.5 లక్షలు, ఉప రాష్ట్రపతికి రూ. 1.25 లక్షలు, గవర్నర్లకు రూ. 1.10 లక్షల చొప్పున జీతం ఉంది.
హోంశాఖ ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రపతి జీతం రూ. 5 లక్షలు, ఉపరాష్ట్రపతి జీతం రూ. 3.5 లక్షలు అవుతాయని అంటున్నారు. ఏడో వేతన సంఘం సిఫార్సులు అమలుచేసిన తర్వాత కేబినెట్ కార్యదర్శి జీతం నెలకు రూ. 2.5 లక్షలు అయింది. కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి జీతం కూడా రూ. 2.25 లక్షలు అయింది. ఇప్పుడు కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాష్ట్రపతి, ఇతరుల జీతాల పెంపు ప్రతిపాదనలను ప్రవేశపెడతారు. చిట్టచివరిసారిగా 2008 సంవత్సరంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల జీతాలు పెంచారు. అప్పటివరకు రాష్ట్రపతి జీతం రూ. 50వేలు, ఉపరాష్ట్రపతికి రూ. 40వేలు, గవర్నర్కు రూ. 36వేల చొప్పున జీతాలు ఉండేవి. జీతాల పెంపుతో పాటు మాజీ రాష్ట్రపతులు, దివంగత రాష్ట్రపతుల భార్యలు తదితరుల పింఛన్లను కూడా పెంచాలని ప్రతిపాదించారు.