వస్త్ర రిటైలర్లకు మెరుగైన ఆదాయం
ముంబై: సంఘటిత వస్త్ర రిటైలర్ల అమ్మకాల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7–8 శాతం వృద్ధి చెందుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. జూన్ క్వార్టర్లో విచక్షణారహిత వినియోగాన్ని ద్రవ్యోల్బణం ప్రభావితం చేసినప్పటికీ.. వివాహాలు, పండుగల సీజన్ డిమాండ్ వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. అలాగే సంఘటిత రిటైల్ సంస్థలు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోకి తమ స్టోర్లను విస్తరిస్తుండడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతోపాటు, మధ్యకాలంలో అమ్మకాల వృద్ధికి దోహదం చేస్తుందని అభిప్రాయపడింది.
కరోనా ముందు సంఘటిత వస్త్ర రిటైలర్ల అమ్మకాల్లో వృద్ధి 8 శాతం స్థాయిలోనే ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. కరోనా కారణంగా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు గణనీయంగా పడిపోవడంతో.. అక్కడ నుంచి చూసుకుంటే (లోబేస్) గత ఆర్థిక సంత్సరంలో (2022–23) వస్త్ర రిటైలర్ల ఆదాయంలో 38 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. నిర్వహణ మార్జిన్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ, గత ఆర్థిక సంవత్సరం మాదిరే 8 శాతంగా ఉంటాయని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. మార్కెటింగ్ వ్యయాలు పెరిగినప్పటికీ ఆ ప్రభావాన్ని తగ్గిన ముడి సరుకుల ధరలు, ప్రీమియం ఉత్పత్తుల విక్రయాలతో అధిగమిస్తాయని పేర్కొంది.
స్టోర్ల విస్తరణ
ఇక వస్త్ర రిటైల్ స్టోర్ల విస్తరణ కరోనా ముందు స్థాయిలోనే 2.2 మిలియన్ చదరపు అడుగుల మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెరగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. గత ఆర్థిక సంతవ్సంలో రిటైల్ స్టోర్ల విస్తరణ 3.7 మిలియన్ చదరపు అడుగులుగానే ఉన్నట్టు గుర్తు చేసింది. 39 సంఘటిత అప్పారెల్ రిటైలర్లపై క్రిసిల్ రేటింగ్స్ అధ్యయనం చేసి ఈ నివేదికను విడుదల చేసింది. గతేడాది వస్త్ర రిటైలర్ల రూ.1.9 లక్షల కోట్ల ఆదాయంలో ఈ సంస్థల వాటా 25 శాతంగా ఉంది.
వినియోగదారులు బ్రాండెడ్ వ్రస్తాలకు ప్రాధాన్యం ఇస్తుండడం, తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేస్తుండంతో ప్రీమియం విభాగంలో డిమాండ్ క్రమంగా పెరుగుతున్నట్టు క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్సేథి తెలిపారు. మధ్యస్థ ధరలు, వ్యాల్యూ విభాగంలో తక్కువ డిమాండ్ ప్రభావాన్ని అధిగమించేందుకు ప్రీమియం విభాగం డిమాండ్ సాయపడుతున్నట్టు చెప్పారు. వస్త్ర రిటైలర్ల ఆదాయంలో 60 శాతం మధ్యస్థ, తక్కువ శ్రేణి విభాగాల నుంచే వస్తున్నట్టు తెలియజేశారు. స్టోర్ల విస్తరణ, రాబోవు పండుగలు, వివాహాల సీజన్ ఫలితంగా మూడో త్రైమాసికం (డిసెంబర్ క్వార్టర్) మెరుగైన అమ్మకాలు నమోదవుతాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది.