మళ్లీ బడికి వెళ్లాలనిపిస్తోంది.. : కిరణ్‌కుమార్‌రెడ్డి
ఆగాఖాన్ అకాడమీ ప్రారంభోత్సవంలో సీఎం కిరణ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ‘నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా... అక్కడ చదువుకున్న తర్వాత పాఠశాలకు తిరిగి వెళ్లలేదు. ఈ రోజు ఆగాఖాన్ అకాడమీని చూస్తుంటే.. మళ్లీ స్కూల్‌కు వెళ్లాలనిపిస్తోంది..అలాంటి వాతావరణం ఇక్కడ ఉంది’ అని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల సమీపంలో ఆగాఖాన్ అకాడ మీని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. విద్య పరంగా అభివృద్ధి చెందితేనే ప్రతి రంగం ముందుకెళ్తుందన్నారు.
ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలు ఇక్కడున్నాయన్నారు. వీటి జతకు ఆగాఖాన్ అకాడమీ చేరడం శుభపరిణామమన్నారు. అనంతరం ప్రిన్స్ ఆగాఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ విద్యాసంస్థ ఏర్పాటుకు స్థలం కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిన మూడేళ్లలో 230 మిలియన్ల పిల్లలను పాఠశాలల్లో చేర్పించినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి పల్లంరాజు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, అకాడమీ డెరైక్టర్ సలీంభాటియా, కలెక్టర్ బి. శ్రీధర్ పాల్గొన్నారు.