వైద్యం కరువై నవజాత శిశువు మృతి
వైద్యసిబ్బంది నిర్లక్ష్యంతోనే: బాధితులు
శోకసంద్రంలో దంపతులు
నీరుగారుతున్న మార్పు పథకం
బంగారంపేట (పెళ్లకూరు): గర్భిణులపై ప్రత్యేక దృష్టిసారించి, వారిని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడేందుకు, వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ‘మార్పు’ కింద ఏఎన్ఎంలను నియమించింది. కానీ ప్రభుత్వం గర్భిణులపై చూపుతున్నామన్న శ్రద్ధ వాస్తవ విరుద్ధంగా ఉంది. బంగారుపేటలో శుక్రవారం తాజాగా చోటుచేసుకున్న సంఘటనతో మరోసారి ఇది రుజువైంది. వైద్యారోగ్య సిబ్బంది సరైన పోషకాహారం, ప్రత్యేక శ్రద్ధ వహించకపోవడంతో బంగారుపేట గ్రామానికి చెందిన సమాధి శ్రీలక్ష్మికి పుట్టిన నవజాత మగబిడ్డ శుక్రవారం మరణించింది. నెలకిందటే తాళ్వాయిపాడుకు చెందిన ముస్సరత్జహకి సరైన వైద్యం అందక మగబిడ్డ మృతిచెందిన విషయం మరువక ముందే ఈ సంఘటన చోటుచేసుకోవడంతో గర్భిణుల ఆరోగ్యంపై సిబ్బంది ఎలాంటి శ్రద్ధ వహిస్తున్నారో అర్థంచేసుకోవచ్చు. స్థానిక బీసీ కాలనీకి చెందిన శ్రీలక్ష్మికి తొలి, మలి కాన్పుల్లో ఆడపిల్లలకు జన్మనిచ్చింది.
మూడోసారీ శ్రీలక్ష్మి గర్భం దాల్చడంతో ఈ సారైనా మగబిడ్డ పుడతాడేమోనని భర్త బాలాజీ ఆశపడ్డాడు. అతను అనుకున్న విధంగానే ఈ సారి మగబిడ్డ జన్మించాడు.. అయితే ఎనిమిది నెలలకే ప్రసవం కావడంతో ఆ పిల్లాడు పుట్టిన వెంటనే మరణించాడు. దీంతో ఆ దంపతులిద్దరూ శోకసంద్రంలో మునిగిపోయారు. గురువారం రాత్రి ఆమెకు నొప్పులు రావడంతో 108 అందుబాటులో లేకపోవడంతో ఆటోలోనే నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మార్పు పథకం నీరుగారడంతోనే పుట్టిన పిల్లలు మృత్యువాత పడుతున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ‘మార్పు’ కింద తన పేరు రికార్డుల్లో నమోదైనా, వైద్యసిబ్బంది ఎలాంటి సదుపాయాలు కల్పించడం, ప్రతినెలా ఆస్పత్రుల్లో చూపించడం చేయలేదని బాధితులు తెలిపారు. ఈ విషయమై డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సాయిబాబాని వివరణ కోరగా.. దీనిపై ఎలాంటి సమాచారం లేదని, విచారించి చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు.