samaikhayndhra
-
వైఎస్ఆర్ సీపీ సమైక్యానికి సానుకూల స్పందన
హైదరాబాద్ : రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే మూడు ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్ష అని ఆపార్టీ సీనియర్ నేత మైసూరారెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జాతీయ స్థాయిలో వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషికి సానుకూల స్పందన వచ్చిందని ఆయన అన్నారు. మైసూరారెడ్డి మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ తీర్మానం లేకుండా ఆర్టికల్ 3 ప్రకారం విభజన సమంజసం కాదన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్, కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ ఇప్పటివరకూ అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలను కలిశామన్నారు. తమ వాదనతో పలు పార్టీల నేతలు ఏకీభవించారని మైసూరారెడ్డి తెలిపారు. కొన్ని పార్టీల నేతలు అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారన్నారు. తమ వాదన విని కొంతమంది నేతలు విస్మయం చెందారని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఇంతగా దిగజారి వ్యవహరిస్తుందని అనుకోలేదని కొందరు నేతలు తమతో చెప్పారని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న విషయం అందరికి చెప్పామన్నారు. రాష్ట్రపతిని కలిసినప్పుడు కూడా అదే అంశం చెప్పామని... మిగిలిన రాజకీయ పార్టీలను కూడా త్వరలోనే కలుస్తామని మైసూరారెడ్డి తెలిపారు. -
కొనసాగుతున్న రహదారుల దిగ్బంధం
-
కొనసాగుతున్న రహదారుల దిగ్బంధం
హైదరాబాద్ : సమైక్యాంధ్రకు మద్దతుగా రెండోరోజు కూడా వైఎస్ఆర్ సీపీ రహదారుల దిగ్బంధం కొనసాగుతోంది. సీమాంధ్ర జిల్లాల్లో వైఎస్ఆర్ సీపీ రహదారులను దిగ్బందిస్తున్నారు. నేతలు నిన్న పోలీసుల ఒత్తిళ్లు అరెస్టులకు తలొగ్గకుండా రహదారులను దిగ్భందించిన బెజవాడ వాసులు గురువారం కూడా కదం తొక్కారు. విభజన ప్రకటన ఆగే వరకు రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తొమ్మిదో నంబర్ జాతీయ రహదారిపై ఇబ్రహీం పట్నం వద్ద భైఠాయించారు. దీంతో హైదరాబాద్ విజయవాడల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఝాం అయింది. విద్యార్థులు, మహిళలు కూడా స్వచ్ఛందంగా దిగ్భందనంలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం క్రిష్టవరం టోల్‌ప్లాజా వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. అర్ధరాత్రి జాతీయ రహదారిపై టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గ నాయకుడు జ్యోతుల నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే జిల్లాలో దిండి-చించినాడ బ్రిడ్జిపై మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు, బొంతు రాజేశ్వరరావు, మత్తి జయప్రకాష్ ఆధ్వర్యంలో ఎన్‌హెచ్ 216ను వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు దిగ్బంధించారు. దాంతో వాహనాలు నిలిచిపోయాయి. అలాగే నగరంలోని ఓఎన్జీసీ రిఫైనరీ ఎదుట వైఎస్ఆర్ సీపీ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, వేణుగోపాలరావు, మందపాటి కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో దిగ్బంధం చేశారు. ముమ్మడివరంలో గుత్తుల సాయి ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధంతో ట్రాఫిక్ స్తంభించింది.