samaikyandhra udyamam
-
సమైక్యమే లక్ష్యంగా YSRCP పోరాటం
-
నేటినుంచి విధుల్లోకి వైద్యులు
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రభుత్వ వైద్యులు నేటి నుంచి విధుల్లో పాల్గొననున్నట్లు ప్రకటించారు. శనివారం రాత్రి వైద్య బృందం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసింది. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలో రోగులకు తీరని నష్టం జరుగుతుందని, వైద్యపరంగా చాలా కోల్పోవాల్సి వస్తుందని వారు వివరించారు. అయితే తమ ఆవేదనను సీఎం సరిగా అర్థం చేసుకోలేదని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. పేద రోగులకు ఇబ్బందులు కలుగుతున్న దృష్ట్యా తాము విధుల్లో చేరుతున్నామని ప్రకటించారు. సోమవారం నుంచి అన్ని ఆస్పత్రుల్లోనూ ఔట్‌పేషంట్ సేవలు, ఆపరేషన్ థియేటర్ సేవలు జరుగుతాయన్నారు. ఇది తాత్కాలిక విరమణే అని, అవసరమైతే మెరుపు సమ్మె చేయడానికి వెనుకాడమని హెచ్చరించారు. తమకు సహకరించిన అందిరికీ అభినందనలు తెలుపుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డా.రామ్మోహన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఉగ్రరూపం
సాక్షి, కడప : సమైక్య ఉద్యమం మహోగ్రంగా సాగుతోంది. దిక్కులు పిక్కటిల్కేలా సమైక్య వాదం జిల్లాలో మార్మోగుతోంది. లక్ష మందితో నిర్వహించిన పొలికేక సభతో ప్రొద్దుటూరు పట్టణం దద్దరిల్లింది. 37 రోజులుగా జిల్లా వ్యాప్తంగా సమైక్య ఉద్యమం అదే వాడి వేడితో సాగుతోంది. గురువారం కూడా దీక్షలు, ఆందోళనలు, ర్యాలీలతో మానవహారాలు, వినూత్న నిరసనలతో ఉద్యమం కొనసాగింది. కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ నేతలు, డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రామకృష్ణారెడ్డి, కోటా నరసింహారావు చేపట్టిన ఆమరణ దీక్ష గురువారంతో నాల్గవ రోజు పూర్తయింది. ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు, వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి, అంజాద్బాష, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ లక్ష్మినారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు డాక్టర్ వెంకట సుబ్బయ్య, ఒ. ప్రభాకర్‌రెడ్డి దీక్షలకు సంఘీభావం తెలిపారు. డెకరేటర్స్ అండ్ సప్లయర్స్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి కోటిరెడ్డి సర్కిల్లో మానవహారంగా ఏర్పడ్డారు. కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కుట్టు మిషన్లతో టైలర్లు ర్యాలీ నిర్వహించి నడిరోడ్డుపై కొలతలు తీసుకుని దుస్తులు కుట్టి వినూత్న నిరసన తెలిపారు. పుష్పగిరి స్కూలు విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణన్ మాస్క్‌లతో ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, జేఏసీ శిబిరంలో శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాల, నిర్మలా ఫార్మశీ విద్యార్థులు రిలే దీక్షల్లో కూర్చొన్నారు. విద్యుత్, ఆర్అండ్బీ, మున్సిపల్, పంచాయతీరాజ్, వాణిజ్యపన్నులశాఖ, ఏపీడబ్ల్యు ఈఐడీసీ విభాగం ఈఈ కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు, న్యాయశాఖ, న్యాయవాదుల దీక్షలు కొనసాగాయి. ప్రొద్దుటూరులో లక్ష మందితో నిర్వహించిన పొలికేక విజయవంతమైంది. జేఏసీ సమన్వయకర్తలు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంఈఓ, ఎన్జీఓల ఆధ్వర్యంలో సభను నిర్వహించారు. ఎమ్మెల్యే లింగారెడ్డి, ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, వైఎస్సార్సీపీ నేత ఈవీ సుధాకర్‌రెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు. వంగపండు ఉష ఆటాపాటా సభికులను ఆకట్టుకుంది. పరకాల ప్రభాకర్ ప్రసంగం సమైక్యవాదులను చైతన్యపరిచింది. న్యాయవాదులు, ప్రైవేటు విద్యా సంస్థల ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. పులివెందులలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, స్వామి వివేకానంద స్కూలు విద్యార్థులు భారీర్యాలీ నిర్వహించి పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. అక్కడే సర్వేపల్లి రాధాకృష్ణన్ వేషధారణలో చర్చాగోష్ఠి ఏర్పాటు చేశారు. ఆర్టీసీ అద్దె బస్సులతో కార్మికులు భారీర్యాలీ నిర్వహించారు. మైదుకూరులో ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులతోపాటు కృష్ణాపురం గ్రామ ప్రజలు ర్యాలీ నిర్వహించి నాలుగు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టారు. కోలాటం, సంకీర్తనలు ఏర్పాటు చేశారు. న్యాయవాదులు, ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగాయి. రాయచోటి పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నగేష్ అనే రిటైర్డ్ ఉపాధ్యాయుడిని సన్మానించారు. ఉపాధ్యాయులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పొట్టి శ్రీరాములు,మహాత్మాగాంధీ, సుభాష్‌చంద్రబోస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేతాజీ సర్కిల్లో మానవహారంగా ఏర్పడ్డారు. ఆర్టీసీ ఉద్యోగులు రోడ్లు ఊడ్చి తమ నిరసన తెలిపారు. రైల్వేకోడూరులో ఉపాధ్యాయులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. న్యాయవాదుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి వంటా వార్పు చేపట్టారు. రాజంపేటలో ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ రోడ్డులోని ఎల్ఐసీ కార్యాలయం నుంచి టౌన్ పోలీసుస్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వంటా వార్పుతో తమ నిరసన తెలిపారు. బద్వేలు పట్టణంలో బ్రాహ్మణులు భారీర్యాలీ నిర్వహించి చండీయాగం చేశారు. ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటాన్ని ఊరేగించి రోడ్డుపైనే గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. కమలాపురంలో ఉపాధ్యాయులు బస్సు యాత్ర చేపట్టి గ్రామాల్లో సమైక్య ఉద్యమం పట్ల చైతన్యవంతం చేశారు. జమ్మలమడుగు పట్టణంలో 150 మందికి పైగాసామూహిక దీక్షల్లో కూర్చొన్నారు. -
సీమాంధ్రలో ఎగసిన జనోద్యమ భేరి
సాక్షి నెట్వర్క్: దేశంలోనే ప్రథమ భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలంటూ సీమాంధ్రలో ఎగసిన జనోద్యమ భేరి వరుసగా 35వ రోజైన మంగళవారం నాడూ మార్మోగింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో స్వచ్ఛందంగా లక్షలాదిమంది ప్రజలు రోడ్లపైకి వచ్చి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, రోడ్ల దిగ్బంధాలు, నిరాహార దీక్షలు, కాంగ్రెస్, టీడీపీ నేతల దిష్టిబొమ్మల దహనాలతో ఊరూవాడా దద్దరిల్లింది. విశాఖపట్నం జిల్లా భీమిలిలో సమైక్యవాదులు సముద్రంలో దిగి జలదీక్ష చేపట్టారు. నక్కపల్లి మండలం దేవవరం జాతీయ రహదారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దిగ్బంధించారు. ఏజెన్సీలోని పది మండలాల్లో మూడోరోజు బంద్ విజయవంతమైంది. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురులో జాతీయరహదారిపై ఉపాధ్యాయులు శవాసనాలు వేసి నిరసన వ్యక్తం చేయగా, విద్యార్థులు మోకాళ్లపై నిలబడి రాస్తారోకో చేపట్టారు. రాజీనామాలు చేయకుండా డ్రామాలు ఆడుతున్నారంటూ తొమ్మిది మంది కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలకు ముమ్మిడివరంలో శవయాత్ర నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం చినమల్లం గ్రామానికి చెందిన వందలాది రైతులు పెనుగొండ మండలంలోని సిద్ధాంతంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. చింతలపూడిలో నాయీ బ్రాహ్మణుల ఉద్యమానికి సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ నడిరోడ్డుపై షేవింగ్ చేసి రాష్ట్ర విభజన వద్దంటూ నినదించారు. కృష్ణా జిల్లా విజయవాడలో ఐఎంఏ ఆధ్వర్యంలో ఆస్పత్రుల బంద్ పాటించారు. విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం సిబ్బంది ఇంద్రకీలాద్రి టోల్గేట్ వద్ద డోలు, సన్నాయి వాయిద్యంతో నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోనియా మాస్కు ధరించి విభజన భూతం పట్టినట్లు సమైక్యవాదులు వినూత్నంగా నిరసన తెలిపారు. కణేకల్లులో వైఎస్సార్సీపీ నేతల రిలేదీక్షలను ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విరమింపజేశారు. గుంటూరు జిల్లా కారంపూడిలో చేపట్టిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చిలకలూరిపేటలో విద్యార్థులు చేపట్టిన దీక్షలను వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ప్రారంభించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుడా సర్కిల్లో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో క్రిస్టియన్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో గాండ్లసంఘం ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ల ర్యాలీ జరిగింది. కాంగ్రెస్ అధిష్టానానికి బుద్ధి ప్రసాదించమ్మా తల్లి అంటూ విజయనగరంలో పైడితల్లమ్మవారికి మొక్కులు చెల్లించారు. నెల్లిమర్లలో నిర్వహించిన ర్యాలీలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో నాయీ బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, మానవహారం చేపట్టారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మిగనూరులో ఉపాధ్యాయులు భిక్షాటన చేపట్టారు. ఆళ్లగడ్డలో క్రేన్లకు సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను వేలాడదీసి ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలో శాంతియజ్ఞం, హోమం నిర్వహించారు. రాజాంలో న్యాయవాదులు మాక్ కోర్టును నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో పద్మశాలీయులు రోడ్డుపైనే మగ్గాలతో ర్యాలీ చేస్తూ, మహిళలు పడుగులు నేస్తూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పోరుమామిళ్లలో వేలాది మంది ఉద్యోగులు, ప్రజలు, విద్యార్థులు రోడ్లపైనే కూర్చొని పట్టణాన్ని దిగ్బంధించారు. కాగా, అనంతపురం, కర్నూలుజిల్లా ఆదోని, పశ్చిమ గోదావరిజిల్లా భీమవరం, పాలకొల్లు, గుంటూరు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా పుత్తూరులలో లక్ష గళార్చన ప్రతిధ్వనించింది. విభజన తట్టుకోలేక ముగ్గురు మృతి రాష్ట్ర విభజన ప్రయత్నాలను తట్టుకోలేక చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన సోమశేఖర్ (33) మంగళవారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకోగా, మరో ఇద్దరు భావోద్వేగానికి గురై గుండెపోటుతో మరణించారు.