సాక్షి, కడప : సమైక్య ఉద్యమం మహోగ్రంగా సాగుతోంది. దిక్కులు పిక్కటిల్కేలా సమైక్య వాదం జిల్లాలో మార్మోగుతోంది. లక్ష మందితో నిర్వహించిన పొలికేక సభతో ప్రొద్దుటూరు పట్టణం దద్దరిల్లింది. 37 రోజులుగా జిల్లా వ్యాప్తంగా సమైక్య ఉద్యమం అదే వాడి వేడితో సాగుతోంది. గురువారం కూడా దీక్షలు, ఆందోళనలు, ర్యాలీలతో మానవహారాలు, వినూత్న నిరసనలతో ఉద్యమం కొనసాగింది.
కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ నేతలు, డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రామకృష్ణారెడ్డి, కోటా నరసింహారావు చేపట్టిన ఆమరణ దీక్ష గురువారంతో నాల్గవ రోజు పూర్తయింది. ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు, వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి, అంజాద్‌బాష, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ లక్ష్మినారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు డాక్టర్ వెంకట సుబ్బయ్య, ఒ. ప్రభాకర్‌రెడ్డి దీక్షలకు సంఘీభావం తెలిపారు.
డెకరేటర్స్ అండ్ సప్లయర్స్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి కోటిరెడ్డి సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కుట్టు మిషన్లతో టైలర్లు ర్యాలీ నిర్వహించి నడిరోడ్డుపై కొలతలు తీసుకుని దుస్తులు కుట్టి వినూత్న నిరసన తెలిపారు.
పుష్పగిరి స్కూలు విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణన్ మాస్క్‌లతో ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, జేఏసీ శిబిరంలో శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాల, నిర్మలా ఫార్మశీ విద్యార్థులు రిలే దీక్షల్లో కూర్చొన్నారు. విద్యుత్, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్, పంచాయతీరాజ్, వాణిజ్యపన్నులశాఖ, ఏపీడబ్ల్యు ఈఐడీసీ విభాగం ఈఈ కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు, న్యాయశాఖ, న్యాయవాదుల దీక్షలు కొనసాగాయి.
ప్రొద్దుటూరులో లక్ష మందితో నిర్వహించిన పొలికేక విజయవంతమైంది. జేఏసీ సమన్వయకర్తలు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంఈఓ, ఎన్జీఓల ఆధ్వర్యంలో సభను నిర్వహించారు.
ఎమ్మెల్యే లింగారెడ్డి, ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత ఈవీ సుధాకర్‌రెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు. వంగపండు ఉష ఆటాపాటా సభికులను ఆకట్టుకుంది. పరకాల ప్రభాకర్ ప్రసంగం సమైక్యవాదులను చైతన్యపరిచింది. న్యాయవాదులు, ప్రైవేటు విద్యా సంస్థల ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి.
పులివెందులలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, స్వామి వివేకానంద స్కూలు విద్యార్థులు భారీర్యాలీ నిర్వహించి పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. అక్కడే సర్వేపల్లి రాధాకృష్ణన్ వేషధారణలో చర్చాగోష్ఠి ఏర్పాటు చేశారు. ఆర్టీసీ అద్దె బస్సులతో కార్మికులు భారీర్యాలీ నిర్వహించారు.
మైదుకూరులో ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులతోపాటు కృష్ణాపురం గ్రామ ప్రజలు ర్యాలీ నిర్వహించి నాలుగు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టారు. కోలాటం, సంకీర్తనలు ఏర్పాటు చేశారు. న్యాయవాదులు, ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగాయి.
రాయచోటి పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నగేష్ అనే రిటైర్డ్ ఉపాధ్యాయుడిని సన్మానించారు. ఉపాధ్యాయులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పొట్టి శ్రీరాములు,మహాత్మాగాంధీ, సుభాష్‌చంద్రబోస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేతాజీ సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. ఆర్టీసీ ఉద్యోగులు రోడ్లు ఊడ్చి తమ నిరసన తెలిపారు.
రైల్వేకోడూరులో ఉపాధ్యాయులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. న్యాయవాదుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి వంటా వార్పు చేపట్టారు.
రాజంపేటలో ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ రోడ్డులోని ఎల్‌ఐసీ కార్యాలయం నుంచి టౌన్ పోలీసుస్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వంటా వార్పుతో తమ నిరసన తెలిపారు.
బద్వేలు పట్టణంలో బ్రాహ్మణులు భారీర్యాలీ నిర్వహించి చండీయాగం చేశారు. ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటాన్ని ఊరేగించి రోడ్డుపైనే గురుపూజోత్సవాన్ని నిర్వహించారు.
కమలాపురంలో ఉపాధ్యాయులు బస్సు యాత్ర చేపట్టి గ్రామాల్లో సమైక్య ఉద్యమం పట్ల చైతన్యవంతం చేశారు.
జమ్మలమడుగు పట్టణంలో 150 మందికి పైగాసామూహిక దీక్షల్లో కూర్చొన్నారు.
ఉగ్రరూపం
Published Fri, Sep 6 2013 3:00 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement