సీమాంధ్రలో ఎగసిన జనోద్యమ భేరి | samaikyandhra udyamam in seemandhra areas | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో ఎగసిన జనోద్యమ భేరి

Published Wed, Sep 4 2013 5:30 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

సీమాంధ్రలో ఎగసిన జనోద్యమ భేరి - Sakshi

సీమాంధ్రలో ఎగసిన జనోద్యమ భేరి

సాక్షి నెట్‌వర్క్:  దేశంలోనే ప్రథమ భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలంటూ సీమాంధ్రలో ఎగసిన జనోద్యమ భేరి వరుసగా 35వ రోజైన మంగళవారం నాడూ మార్మోగింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో స్వచ్ఛందంగా లక్షలాదిమంది ప్రజలు రోడ్లపైకి వచ్చి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, రోడ్ల దిగ్బంధాలు, నిరాహార దీక్షలు, కాంగ్రెస్, టీడీపీ నేతల దిష్టిబొమ్మల దహనాలతో ఊరూవాడా దద్దరిల్లింది. విశాఖపట్నం జిల్లా భీమిలిలో సమైక్యవాదులు సముద్రంలో దిగి జలదీక్ష చేపట్టారు. నక్కపల్లి మండలం దేవవరం జాతీయ రహదారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దిగ్బంధించారు. ఏజెన్సీలోని పది మండలాల్లో మూడోరోజు బంద్  విజయవంతమైంది. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురులో జాతీయరహదారిపై ఉపాధ్యాయులు శవాసనాలు వేసి నిరసన వ్యక్తం చేయగా, విద్యార్థులు మోకాళ్లపై నిలబడి రాస్తారోకో చేపట్టారు.
 
రాజీనామాలు చేయకుండా డ్రామాలు ఆడుతున్నారంటూ తొమ్మిది మంది కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలకు ముమ్మిడివరంలో శవయాత్ర నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం చినమల్లం గ్రామానికి చెందిన వందలాది రైతులు పెనుగొండ మండలంలోని సిద్ధాంతంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. చింతలపూడిలో నాయీ బ్రాహ్మణుల ఉద్యమానికి సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ నడిరోడ్డుపై షేవింగ్ చేసి రాష్ట్ర విభజన వద్దంటూ నినదించారు. కృష్ణా జిల్లా విజయవాడలో ఐఎంఏ ఆధ్వర్యంలో ఆస్పత్రుల బంద్ పాటించారు. విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం సిబ్బంది ఇంద్రకీలాద్రి టోల్‌గేట్ వద్ద డోలు, సన్నాయి వాయిద్యంతో నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోనియా మాస్కు ధరించి విభజన భూతం పట్టినట్లు సమైక్యవాదులు వినూత్నంగా నిరసన తెలిపారు.
 
 కణేకల్లులో వైఎస్సార్‌సీపీ నేతల రిలేదీక్షలను ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విరమింపజేశారు. గుంటూరు జిల్లా కారంపూడిలో చేపట్టిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చిలకలూరిపేటలో విద్యార్థులు చేపట్టిన దీక్షలను వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ప్రారంభించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో వైఎస్‌ఆర్  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుడా సర్కిల్‌లో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో క్రిస్టియన్‌లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో గాండ్లసంఘం ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ల ర్యాలీ జరిగింది. కాంగ్రెస్ అధిష్టానానికి బుద్ధి ప్రసాదించమ్మా తల్లి అంటూ విజయనగరంలో పైడితల్లమ్మవారికి మొక్కులు చెల్లించారు. నెల్లిమర్లలో నిర్వహించిన ర్యాలీలో వైఎస్‌ఆర్ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో నాయీ బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, మానవహారం చేపట్టారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మిగనూరులో ఉపాధ్యాయులు భిక్షాటన చేపట్టారు.
 
 ఆళ్లగడ్డలో క్రేన్‌లకు సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను వేలాడదీసి ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలో శాంతియజ్ఞం, హోమం నిర్వహించారు. రాజాంలో న్యాయవాదులు మాక్ కోర్టును నిర్వహించారు.  వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో పద్మశాలీయులు రోడ్డుపైనే మగ్గాలతో ర్యాలీ చేస్తూ, మహిళలు పడుగులు నేస్తూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పోరుమామిళ్లలో వేలాది మంది ఉద్యోగులు, ప్రజలు, విద్యార్థులు రోడ్లపైనే కూర్చొని పట్టణాన్ని దిగ్బంధించారు. కాగా, అనంతపురం, కర్నూలుజిల్లా ఆదోని, పశ్చిమ గోదావరిజిల్లా భీమవరం, పాలకొల్లు, గుంటూరు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా పుత్తూరులలో లక్ష గళార్చన ప్రతిధ్వనించింది.
 
 విభజన తట్టుకోలేక ముగ్గురు మృతి
 రాష్ట్ర విభజన ప్రయత్నాలను తట్టుకోలేక చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన సోమశేఖర్ (33) మంగళవారం పురుగుల మందుతాగి  ఆత్మహత్య చేసుకోగా, మరో ఇద్దరు భావోద్వేగానికి గురై గుండెపోటుతో మరణించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement