seemandhra areas
-
రైతు సమైక్య గర్జన
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 112వరోజూ మంగళవారం సీమాంధ్ర జిల్లాల్లో ఉద్ధృతంగానే ఎగసింది. రోజూమాదిరిగానే ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, సోనియా, కేంద్రమంత్రుల దిష్టిబొమ్మల దహనాలు... వివిధరూపాల్లో ఆందోళనలు హోరెత్తాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సమైక్య రైతు గర్జన నిర్వహించారు. వేలాదిగా రైతులు పాల్గొని సమైక్య నినాదాలు హోరెత్తించారు. రాష్ట్ర రైతు జేఏసీ అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే సీమాం ధ్రకు సాగునీరు అందే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. కూలీలకు ఉపాధి కరువు అవుతుందన్నారు. సమైక్యాంధ్ర జిల్లా రైతు జేఏసీ అధ్యక్షుడు నిమ్మల రామానాయుడు తీర్మానాలు ప్రవేశపెట్టగా రైతులు ఏకగ్రీవంగా ఆమోదించారు. రాష్ట్ర విభజనకు వత్తాసు పలుకుతున్న ఎం పీలు, కేంద్ర మంత్రులను భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరిస్తూ గ్రామ పొలిమేరల్లో బోర్డులు పెట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలని సభ తీర్మానించింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో వివిధ రకాల పూలతో 112 సంఖ్య ఆకారాన్ని ఆవిష్కరించి ఉద్యమ కాలాన్ని గుర్తుచేశారు. మదనపల్లెలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర కార్యాలయాలను ముట్టడించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రకాశంచౌక్‌లో విద్యార్థులు రాస్తారోకో చేశారు. సమైక్యాంధ్ర పోరాట సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు శ్రీకాకుళంలోని డే అండ్ నైట్ కూడలి నుంచి వైఎస్ఆర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన కేంద్రమంత్రి కిల్లి కృపారాణి జన్మదిన శుభాకాంక్షల ఫ్లెక్సీలను చించివేశారు. ఆమె చిత్రానికి చెప్పులతో కొట్టారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం లో ఉపాధ్యాయులు చెవులు మూసుకుని నిరసన తెలిపారు. నూజివీడులో జేఏసీ, ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్(అప్సా) ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ధర్నా నిర్వహించారు. సమైక్యాంధ్ర వర్థిల్లాలి, విభజన వద్దు సమైక్యమే ముద్దు నినాదాలతో నూజివీడు పట్టణం మార్మోగింది. కావూరి, డొక్కాలకు సమైక్య సెగ పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం పరింపూడిలో మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వేదికపైకి రాకుండా వైఎస్సార్ సీపీ, టీడీపీ శ్రేణులు, సమైక్య జేఏసీ సభ్యులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా గురజాలలో రచ్చబండకు వెళుతున్న రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కాన్వాయ్‌ను అడ్డుకోబోగా పోలీసులు సమైక్యవాదులను బలవంతగా పక్కకు నెట్టివేశారు. -
నీళ్లు దోచుకుంటున్నది సీమాంధ్రులే..
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : తెలంగాణ నీళ్లు, నిధులు దోచుకుంటున్నది సీమాంధ్రులేనని పెద్దపల్లి ఎంపీ జి.వివేకానంద విమర్శించారు. శుక్రవారం ఆయన స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందని, ఎగువ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నుంచి నీళ్లు రావని సీమాంధ్ర నాయకులు దుష్ర్పచారం చేస్తున్నారని అన్నారు. సీమాంధ్రలో అభివృద్ధి జరగకుండా ముఖ్యమంత్రి కిరణ్, చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బచావత్ అవార్డు ప్రకారం తెలంగాణకు కృష్ణా జలాలు 298 టీఎంసీలు రావాల్సి ఉందన్నారు. రాయలసీమకు 144 టీఎంసీల నీళ్లు వెళ్లాల్సి ఉండగా 364 టీఎంసీలు వాడుకోవడానికి ప్రాజెక్టులు కడుతున్నారని తెలిపారు. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులెవరూ పనిచేయడం లేదన్నారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో అత్యధికులు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారేనని పేర్కొన్నారు. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి జి.వినోద్, రాష్ట్ర నాయకుడు సిలువేరు నర్సింగం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పి.సురేశ్, టీబీజీకేఎస్ ఏరియా సంయుక్త కార్యదర్శి జి.చంద్రశేఖర్, నాయకులు కొమ్మెర లక్ష్మణ్, కుంబాల రాజేశ్, ఎన్.రమేశ్, ఎస్.హరికృష్ణ, సత్తిబాబు, టీఆర్ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి బడికెల శ్రావణ్ పాల్గొన్నారు. నియామకాలు టీఆర్ఎస్లో పని చేస్తున్న పలువురికి ఎంపీ పదవులు కేటాయించారు. పార్టీ జిల్లా కార్యదర్శులుగా బెల్లంపల్లి నం.2 ఇంక్లైన్బస్తీకి చెందిన ఎల్తూరి శంకర్, బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామానికి చెందిన గోగర్ల రాజేశ్, తూర్పు జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా మునిమంద రమేశ్‌లకు నియామకపత్రాలు అందజేశారు. సీఎం కిరణ్ అబద్ధాల కోరు మందమర్రి రూరల్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అబద్ధాల కోరని పెద్దపల్లి ఎంపీ వివేకానంద విమర్శించారు. శుక్రవారం మందమర్రిలో ఆయన ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ నీళ్లు, నిధులపై కేంద్రానికి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రాణిహిత ప్రాజెక్టుతో తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో ఉన్న గ్రామాలు సస్యశ్యామలం అవుతాయని అన్నారు. ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మాట్లాడుతూ తన స్వలాభం కోసమే హైదరాబాద్‌లో అశోక్‌బాబు సభలు నిర్వహిస్తున్నారని చెప్పారు. సమావేశంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు జే.రవీందర్, తోట రాజిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
రాష్ట్ర విభజనతో జిల్లా ప్రజలకు సాగు, తాగునీటికి అవస్థలు
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు అనుకూలంగా సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం జిల్లా రైతాంగానికి శరాఘాతం కానుంది. కృష్ణా నదీ జలాలతో కళకళలాడే మాగాణి భూములన్నింటికీ రాష్ట్రం విడిపోతే సాగునీరందక ఎడారిగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మెజారిటీ రైతులు పాడి పరిశ్రమ మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. విభజన వల్ల భూములకు నీరందక పశువులకు గ్రాసం కరువై పాడిపరిశ్రమ కుదేలవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటికి సైతం కటకటలాడే పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తంగా రాష్ట్ర విభజన జిల్లాను ఎడారిగా మారుస్తుందని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సాగర్ నీరే ప్రాణాధారం: సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల్లో వివిధ నీటి వనరుల ద్వారా 31,05,240 హెక్టార్ల భూమి సాగవుతోంది. జిల్లాలో 2,32,421 హెక్టార్లు అంటే 5,74,080 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ మొత్తంలో నాగార్జున సాగర్ ద్వారా కృష్ణా జలాలతో 4,29,747 ఎకరాలు సాగు చేస్తున్నారు. కృష్ణా డెల్టా పశ్చిమ కాలువ (కేడబ్ల్యూడీ కెనాల్) ద్వారా 73,122 ఎకరాలు సాగవుతోంది. యర్రగొండపాలెం, దర్శి, అద్దంకి, పర్చూరు, సంతనూతలపాడు, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాలకు సాగర్ నీరు అందుతోంది. పర్చూరు, చీరాల నియోజకవర్గాలకు కృష్ణా డెల్టా పశ్చిమ కాలువ ద్వారా సాగునీరు వస్తోంది. జిల్లాలోని మెజారిటీ తాగునీటి చెరువులకు సాగర్ నీరే దిక్కు. వేసవిలో సాగర్ నీరు అందకపోతే అనేక గ్రామాల ప్రజలకు గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీరు దొరికే పరిస్థితి లేదు. త్రిపురాంతకం మండలంలోని గ్రామాలకు కూడా తాగేందుకు సాగర్ నీరే దిక్కు. కనిగిరి నియోజకవర్గంలోని ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు నెదర్లాండ్ స్కీమ్ ద్వారా సాగర్‌నీరు అందిస్తున్నారు. జలయుద్ధాలు తప్పవా.. రాష్ట్ర విభజనతో నీటి యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి అనివార్యమవుతుంది. ముఖ్యంగా కృష్ణా జలాల పంపిణీలో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే కావేరీ నదీ జలాల పంపిణీ విషయంలో ఏటా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. తుంగభద్ర జలాల విషయంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. కృష్ణా జలాల విషయంలోనూ మహారాష్ట్ర, కర్ణాటకలతో జలవివాదాలు నడుస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జిల్లా రైతాంగం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లవుతుంది. కృష్ణా నదికి ఎగువన తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తే మనకు జలవనరులుగా ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు నీరందక జిల్లాలో సాగర్ ఆయకట్టు ప్రశ్నార్థకం కానుంది. సాగర్ జలాలతో నిండే చెరువుల్లో నీరు లేక భూగర్భ జల మట్టాలు కూడా పడిపోయి తాగునీటి బోర్లు ఒట్టిపోయే పరిస్థితి నెలకొంటుంది. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే జిల్లాకు సాగర్ నీటి పంపిణీలో అన్యాయం జరుగుతోంది. ఎగువన ఉన్న గుంటూరు జిల్లా రైతులు నీరు అక్రమంగా వాడుకుంటుండటంతో జిల్లా రైతాంగం నష్టపోతోంది. అలంకారప్రాయంగా ప్రాజెక్టులు.. రాష్ట్ర విభజన వల్ల కృష్ణా మిగులు జలాలతో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులు అలంకార ప్రాయంగా మిగిలిపోనున్నాయి. కృష్ణానది అంతర్ రాష్ట్ర నది. దీనిలోని జలాలను బచావత్ ట్రిబ్యునల్ మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించింది. మిగులు జలాలను 2010లో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎగువ రాష్ట్రాలకు కూడా పంచారు. దీంతో రాష్ట్రంలో మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న ఏడు సాగునీటి ప్రాజెక్టులు నీరు లేక అలంకార ప్రాయంగా మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ ఏడు ప్రాజెక్టులకు 227.5 టీఎంసీల మిగులు జలాలు అవసరం. నెట్టెంపాడు ప్రాజెక్టుకు 22 టీఎంసీలు, తెలుగు గంగకు 25 టీఎంసీలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయించింది. మిగిలిన ఐదు ప్రాజెక్టులకు శ్రీశైలం వద్ద వచ్చే వరద నీటిని మళ్లించాల్సిందే. జిల్లాలో ఇప్పటికే పూర్తయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు, రామతీర్థం ప్రాజెక్టు కూడా కృష్ణా జలాలపై ఆధారపడి నిర్మించినవే. వెలుగొండ ప్రాజెక్టుకు కూడా నీటి లభ్యత అనుమానమే. ఇప్పటికే నాగార్జున సాగర్, కృష్ణా డెల్టాపై ఆధారపడిన జిల్లా ఆయకట్టు అంతా కాలువల చివర ఉండటం వలన ఎగువన ఉన్న జిల్లాలతో నీటి కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోవలసి వస్తుంది. -
సీమాంధ్రలో ఎగసిన జనోద్యమ భేరి
సాక్షి నెట్వర్క్: దేశంలోనే ప్రథమ భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలంటూ సీమాంధ్రలో ఎగసిన జనోద్యమ భేరి వరుసగా 35వ రోజైన మంగళవారం నాడూ మార్మోగింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో స్వచ్ఛందంగా లక్షలాదిమంది ప్రజలు రోడ్లపైకి వచ్చి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, రోడ్ల దిగ్బంధాలు, నిరాహార దీక్షలు, కాంగ్రెస్, టీడీపీ నేతల దిష్టిబొమ్మల దహనాలతో ఊరూవాడా దద్దరిల్లింది. విశాఖపట్నం జిల్లా భీమిలిలో సమైక్యవాదులు సముద్రంలో దిగి జలదీక్ష చేపట్టారు. నక్కపల్లి మండలం దేవవరం జాతీయ రహదారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దిగ్బంధించారు. ఏజెన్సీలోని పది మండలాల్లో మూడోరోజు బంద్ విజయవంతమైంది. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురులో జాతీయరహదారిపై ఉపాధ్యాయులు శవాసనాలు వేసి నిరసన వ్యక్తం చేయగా, విద్యార్థులు మోకాళ్లపై నిలబడి రాస్తారోకో చేపట్టారు. రాజీనామాలు చేయకుండా డ్రామాలు ఆడుతున్నారంటూ తొమ్మిది మంది కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలకు ముమ్మిడివరంలో శవయాత్ర నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం చినమల్లం గ్రామానికి చెందిన వందలాది రైతులు పెనుగొండ మండలంలోని సిద్ధాంతంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. చింతలపూడిలో నాయీ బ్రాహ్మణుల ఉద్యమానికి సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ నడిరోడ్డుపై షేవింగ్ చేసి రాష్ట్ర విభజన వద్దంటూ నినదించారు. కృష్ణా జిల్లా విజయవాడలో ఐఎంఏ ఆధ్వర్యంలో ఆస్పత్రుల బంద్ పాటించారు. విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం సిబ్బంది ఇంద్రకీలాద్రి టోల్గేట్ వద్ద డోలు, సన్నాయి వాయిద్యంతో నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోనియా మాస్కు ధరించి విభజన భూతం పట్టినట్లు సమైక్యవాదులు వినూత్నంగా నిరసన తెలిపారు. కణేకల్లులో వైఎస్సార్సీపీ నేతల రిలేదీక్షలను ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విరమింపజేశారు. గుంటూరు జిల్లా కారంపూడిలో చేపట్టిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చిలకలూరిపేటలో విద్యార్థులు చేపట్టిన దీక్షలను వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ప్రారంభించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుడా సర్కిల్లో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో క్రిస్టియన్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో గాండ్లసంఘం ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ల ర్యాలీ జరిగింది. కాంగ్రెస్ అధిష్టానానికి బుద్ధి ప్రసాదించమ్మా తల్లి అంటూ విజయనగరంలో పైడితల్లమ్మవారికి మొక్కులు చెల్లించారు. నెల్లిమర్లలో నిర్వహించిన ర్యాలీలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో నాయీ బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, మానవహారం చేపట్టారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మిగనూరులో ఉపాధ్యాయులు భిక్షాటన చేపట్టారు. ఆళ్లగడ్డలో క్రేన్లకు సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను వేలాడదీసి ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలో శాంతియజ్ఞం, హోమం నిర్వహించారు. రాజాంలో న్యాయవాదులు మాక్ కోర్టును నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో పద్మశాలీయులు రోడ్డుపైనే మగ్గాలతో ర్యాలీ చేస్తూ, మహిళలు పడుగులు నేస్తూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పోరుమామిళ్లలో వేలాది మంది ఉద్యోగులు, ప్రజలు, విద్యార్థులు రోడ్లపైనే కూర్చొని పట్టణాన్ని దిగ్బంధించారు. కాగా, అనంతపురం, కర్నూలుజిల్లా ఆదోని, పశ్చిమ గోదావరిజిల్లా భీమవరం, పాలకొల్లు, గుంటూరు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా పుత్తూరులలో లక్ష గళార్చన ప్రతిధ్వనించింది. విభజన తట్టుకోలేక ముగ్గురు మృతి రాష్ట్ర విభజన ప్రయత్నాలను తట్టుకోలేక చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన సోమశేఖర్ (33) మంగళవారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకోగా, మరో ఇద్దరు భావోద్వేగానికి గురై గుండెపోటుతో మరణించారు.