బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : తెలంగాణ నీళ్లు, నిధులు దోచుకుంటున్నది సీమాంధ్రులేనని పెద్దపల్లి ఎంపీ జి.వివేకానంద విమర్శించారు. శుక్రవారం ఆయన స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందని, ఎగువ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నుంచి నీళ్లు రావని సీమాంధ్ర నాయకులు దుష్ర్పచారం చేస్తున్నారని అన్నారు. సీమాంధ్రలో అభివృద్ధి జరగకుండా ముఖ్యమంత్రి కిరణ్, చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బచావత్ అవార్డు ప్రకారం తెలంగాణకు కృష్ణా జలాలు 298 టీఎంసీలు రావాల్సి ఉందన్నారు.
రాయలసీమకు 144 టీఎంసీల నీళ్లు వెళ్లాల్సి ఉండగా 364 టీఎంసీలు వాడుకోవడానికి ప్రాజెక్టులు కడుతున్నారని తెలిపారు. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులెవరూ పనిచేయడం లేదన్నారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో అత్యధికులు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారేనని పేర్కొన్నారు. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జి.వినోద్, రాష్ట్ర నాయకుడు సిలువేరు నర్సింగం, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు పి.సురేశ్, టీబీజీకేఎస్ ఏరియా సంయుక్త కార్యదర్శి జి.చంద్రశేఖర్, నాయకులు కొమ్మెర లక్ష్మణ్, కుంబాల రాజేశ్, ఎన్.రమేశ్, ఎస్.హరికృష్ణ, సత్తిబాబు, టీఆర్‌ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి బడికెల శ్రావణ్ పాల్గొన్నారు.
నియామకాలు
టీఆర్‌ఎస్‌లో పని చేస్తున్న పలువురికి ఎంపీ పదవులు కేటాయించారు. పార్టీ జిల్లా కార్యదర్శులుగా బెల్లంపల్లి నం.2 ఇంక్లైన్‌బస్తీకి చెందిన ఎల్తూరి శంకర్, బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామానికి చెందిన గోగర్ల రాజేశ్, తూర్పు జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా మునిమంద రమేశ్‌లకు నియామకపత్రాలు అందజేశారు.
సీఎం కిరణ్ అబద్ధాల కోరు
మందమర్రి రూరల్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అబద్ధాల కోరని పెద్దపల్లి ఎంపీ వివేకానంద విమర్శించారు. శుక్రవారం మందమర్రిలో ఆయన ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ నీళ్లు, నిధులపై కేంద్రానికి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రాణిహిత ప్రాజెక్టుతో తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో ఉన్న గ్రామాలు సస్యశ్యామలం అవుతాయని అన్నారు. ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మాట్లాడుతూ తన స్వలాభం కోసమే హైదరాబాద్‌లో అశోక్‌బాబు సభలు నిర్వహిస్తున్నారని చెప్పారు. సమావేశంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు జే.రవీందర్, తోట రాజిరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నీళ్లు దోచుకుంటున్నది సీమాంధ్రులే..
Published Sat, Nov 9 2013 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM
Advertisement
Advertisement