ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు అనుకూలంగా సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం జిల్లా రైతాంగానికి శరాఘాతం కానుంది. కృష్ణా నదీ జలాలతో కళకళలాడే మాగాణి భూములన్నింటికీ రాష్ట్రం విడిపోతే సాగునీరందక ఎడారిగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మెజారిటీ రైతులు పాడి పరిశ్రమ మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. విభజన వల్ల భూములకు నీరందక పశువులకు గ్రాసం కరువై పాడిపరిశ్రమ కుదేలవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటికి సైతం కటకటలాడే పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తంగా రాష్ట్ర విభజన జిల్లాను ఎడారిగా మారుస్తుందని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సాగర్ నీరే ప్రాణాధారం: సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల్లో వివిధ నీటి వనరుల ద్వారా 31,05,240 హెక్టార్ల భూమి సాగవుతోంది. జిల్లాలో 2,32,421 హెక్టార్లు అంటే 5,74,080 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ మొత్తంలో నాగార్జున సాగర్ ద్వారా కృష్ణా జలాలతో 4,29,747 ఎకరాలు సాగు చేస్తున్నారు. కృష్ణా డెల్టా పశ్చిమ కాలువ (కేడబ్ల్యూడీ కెనాల్) ద్వారా 73,122 ఎకరాలు సాగవుతోంది. యర్రగొండపాలెం, దర్శి, అద్దంకి, పర్చూరు, సంతనూతలపాడు, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాలకు సాగర్ నీరు అందుతోంది. పర్చూరు, చీరాల నియోజకవర్గాలకు కృష్ణా డెల్టా పశ్చిమ కాలువ ద్వారా సాగునీరు వస్తోంది. జిల్లాలోని మెజారిటీ తాగునీటి చెరువులకు సాగర్ నీరే దిక్కు. వేసవిలో సాగర్ నీరు అందకపోతే అనేక గ్రామాల ప్రజలకు గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీరు దొరికే పరిస్థితి లేదు. త్రిపురాంతకం మండలంలోని గ్రామాలకు కూడా తాగేందుకు సాగర్ నీరే దిక్కు. కనిగిరి నియోజకవర్గంలోని ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు నెదర్లాండ్ స్కీమ్ ద్వారా సాగర్‌నీరు అందిస్తున్నారు.
జలయుద్ధాలు తప్పవా.. రాష్ట్ర విభజనతో నీటి యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి అనివార్యమవుతుంది. ముఖ్యంగా కృష్ణా జలాల పంపిణీలో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే కావేరీ నదీ జలాల పంపిణీ విషయంలో ఏటా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. తుంగభద్ర జలాల విషయంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. కృష్ణా జలాల విషయంలోనూ మహారాష్ట్ర, కర్ణాటకలతో జలవివాదాలు నడుస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జిల్లా రైతాంగం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లవుతుంది. కృష్ణా నదికి ఎగువన తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తే మనకు జలవనరులుగా ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు నీరందక జిల్లాలో సాగర్ ఆయకట్టు ప్రశ్నార్థకం కానుంది. సాగర్ జలాలతో నిండే చెరువుల్లో నీరు లేక భూగర్భ జల మట్టాలు కూడా పడిపోయి తాగునీటి బోర్లు ఒట్టిపోయే పరిస్థితి నెలకొంటుంది. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే జిల్లాకు సాగర్ నీటి పంపిణీలో అన్యాయం జరుగుతోంది. ఎగువన ఉన్న గుంటూరు జిల్లా రైతులు నీరు అక్రమంగా వాడుకుంటుండటంతో జిల్లా రైతాంగం నష్టపోతోంది.
అలంకారప్రాయంగా ప్రాజెక్టులు.. రాష్ట్ర విభజన వల్ల కృష్ణా మిగులు జలాలతో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులు అలంకార ప్రాయంగా మిగిలిపోనున్నాయి. కృష్ణానది అంతర్ రాష్ట్ర నది. దీనిలోని జలాలను బచావత్ ట్రిబ్యునల్ మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించింది. మిగులు జలాలను 2010లో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎగువ రాష్ట్రాలకు కూడా పంచారు. దీంతో రాష్ట్రంలో మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న ఏడు సాగునీటి ప్రాజెక్టులు నీరు లేక అలంకార ప్రాయంగా మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ ఏడు ప్రాజెక్టులకు 227.5 టీఎంసీల మిగులు జలాలు అవసరం. నెట్టెంపాడు ప్రాజెక్టుకు 22 టీఎంసీలు, తెలుగు గంగకు 25 టీఎంసీలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయించింది. మిగిలిన ఐదు ప్రాజెక్టులకు శ్రీశైలం వద్ద వచ్చే వరద నీటిని మళ్లించాల్సిందే.
జిల్లాలో ఇప్పటికే పూర్తయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు, రామతీర్థం ప్రాజెక్టు కూడా కృష్ణా జలాలపై ఆధారపడి నిర్మించినవే. వెలుగొండ ప్రాజెక్టుకు కూడా నీటి లభ్యత అనుమానమే. ఇప్పటికే నాగార్జున సాగర్, కృష్ణా డెల్టాపై ఆధారపడిన జిల్లా ఆయకట్టు అంతా కాలువల చివర ఉండటం వలన ఎగువన ఉన్న జిల్లాలతో నీటి కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోవలసి వస్తుంది.
రాష్ట్ర విభజనతో జిల్లా ప్రజలకు సాగు, తాగునీటికి అవస్థలు
Published Thu, Sep 26 2013 4:06 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement