ఈ హైడ్రామా హైకమాండ్‌దా.. నేతలదా?
Published Sat, Oct 26 2013 3:08 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
రాష్ట్ర విభజనపై ముసాయిదా నోట్‌ను కేంద్ర మంత్రిమండలి ఆమోదించి దానిపై జీవోఎంను కూడా ఏర్పాటు చేసి ముందుకు వెళుతున్న తరుణంలో సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో హడావుడి చేయడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర సమైక్యత కోసం ప్రయత్నిస్తామని ఢిల్లీ వెళ్లిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, విభజనను ఆపడమెలాగో తెలియక మళ్లీ మొదటికొచ్చి అసెంబ్లీకి తీర్మానం పంపాలని కొత్త బాణీ వినిపిస్తున్నారు. ఢిల్లీలో హైకమాండ్ నేతలతో కలసి సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు హైడ్రామా నడిపిస్తుండగా, రాష్ట్రాన్ని విభజించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించిన 87 రోజుల తర్వాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ తీర్మానం కోరండంటూ ప్రధానమంత్రికి లేఖ రాయడం గమనార్హం.
జూలై 30న యూపీఏ భాగస్వామ్య పక్షాలు, ఆ వెంటనే సీడబ్ల్యూసీ తెలంగాణ ఏర్పాటును ఆమోదిస్తూ తీర్మానం చేసిన తర్వాత కేంద్ర హోం శాఖ రూపొందించిన ముసాయిదా నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ తీర్మానం కోరకుండానే ముందుకు వెళుతున్నట్టు స్పష్టమైంది. పైగా అసెంబ్లీ అభిప్రాయం మాత్రమే కోరుతామని, తెలంగాణ ఏర్పాటు కోసం తీర్మానం కోరడం లేదని కేంద్రం స్పష్టంగా తేల్చింది. మూడు నెలలుగా ఈ వ్యవహారమంతా సాగుతున్నప్పటికీ, అసెంబ్లీలో తీర్మానాన్ని అడ్డుకుంటామని ముఖ్యమంత్రితో పాటు సీమాంధ్ర నేతలు చాలాసార్లు ప్రకటించారు. కేంద్రం అసెంబ్లీ తీర్మానం కోరుతుందని, ఆ సమయంలో వ్యతిరేకిస్తామంటూ చెప్పారు. ఉద్యోగ సంఘాలతో సీఎం ఇదే చెప్పి ఆందోళన విరమింపజేశారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్లిన నేతలు బిల్లు ముసాయిదాను అసెంబ్లీకి పంపాలని పార్టీ నేతలను,అక్కడే ఉన్న రాష్ట్ర గవర్నర్‌ను కలిసి విన్నవించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఒకవైపు తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని, వెనక్కి తగ్గేది లేదని చెబుతూనే,అసెంబ్లీ తీర్మానం,అభిప్రాయం రెండూ ఉంటాయని దిగ్విజయ్‌సింగ్ కొద్దిరోజులు అయోమయపరిచే వ్యాఖ్యలు చేశారు. తీరా హోం శాఖ రూపొందించిన ముసాయిదాతో పాటు ఆ శాఖ నుంచి అందిన వివరణతో తీర్మానం ఉండదనీ, కేవలం శాసనసభ అభిప్రాయం కోరుతూ బిల్లును అక్కడికి పంపిస్తారని తేలిపోయింది.
అయినప్పటికీ సీమాంధ్ర నాయకులు కలిసిన సందర్భంగా ఈ అంశాన్ని పరిశీలిస్తామంటూ ప్రజలను గందరగోళపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదంతా పథకం ప్రకారమే హైకమాండ్ వ్యవహారాలను నడిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణపై మంత్రుల బృందాన్ని కూడా కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ బృందం అన్ని శాఖల అధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తోంది. మరోవైపు గవర్నర్ నరసింహన్‌ను హస్తినకు రప్పించి కేంద్ర పెద్దలు చర్చలు సాగిస్తున్నారు. గవర్నర్ 3 రోజులుగా విభజన ప్రక్రియపై సమాలోచనలు జరుపుతుండగా, మరోవైపు హోంశాఖ విభజనలో ఎదురయ్యే ఇబ్బందులపై ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులను సంప్రతిస్తుండగా ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాశారు. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ సాగిస్తున్న హైడ్రామాలో భాగమనే అభిప్రాయం ఆ పార్టీలోనే వినిపిస్తోంది.
Advertisement