దగా!
అధికారం కోసం రైతు రుణాల మాఫీ హామీ గుప్పించి ఓట్లు దండుకున్నారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టగానే వంచనకు పాల్పడ్డారు. రుణాల మాఫీపై కమిషన్ అంటూ కొంతకాలం కాలయాపన చేశారు. ఎన్నికల హామీని నిలబెట్టుకుంటారని భావించిన మహిళలు, రైతన్నలను ముఖ్యమంత్రి చంద్రబాబు బురిడీ కొట్టించారు. దగాకోరు పాలనపై రైతులు నేడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సమరభేరి మోగించనున్నారు.
సాక్షి ప్రతినిధి, కడప:
ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించండి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే రైతుల రుణాలు మాఫీ చేస్తూ తొలిసంతకం చేస్తా... అక్కచెల్లెల్లకు అండగా నిలుస్తా... డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తా... ఎన్నికల సమయంలో ప్రతి బహిరంగసభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన హామీ ఇది.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రుణాలు మాఫీ అవుతాయని భావించిన రైతన్నల ఆశలు ఆవిరి అయ్యాయి. రుణమాఫీ విధివిధానాలపై కమిషన్ వేస్తూ 45రోజులు గడువు విధించారు. ప్రతి కుటుంబానికి రూ.1.5లక్షల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. రుణాలు మాఫీ అయి కొత్త రుణాలు పొందొచ్చనుకున్న రైతన్నలను దగా చేశారు.
ఆశగా ఎదురు చూసిన రైతాంగం....
అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల హామీతో రైతాంగం ఎంతో ఆశగా ఎదురు చూసింది. జిల్లాలో సుమారు 12లక్షల మంది రైతన్నలు రుణాలు మాఫీ అవుతాయని ఆశించారు. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు విధివిధానాలంటూ కొత్తరాగం తీయడంతో రైతాంగం నిరాశ నిస్పృహలకు గురవుతోంది.
జిల్లాలో 2013-14 వరకూ రైతులకు సంబంధించిన రూ.6063.19కోట్ల రుణాలు ఉన్నాయి. అందుకు గాను 6,38,421మంది రైతులు బకాయిలు ఉన్నారు. వీరికి తోడుగా మరో 5,59,493 మంది రైతులు రూ.2,124.43 కోట్లు బంగారు ఆభరణాలపై రుణాలు పొందారు. ఇవన్నీ రద్దు అవుతాయని రుణగ్రహీతలు భావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సరికొత్త నిర్ణయంతో రైతన్నల ఆశలు నీరుగారిపోయాయి.
అదనపుభారం రూ.725 కోట్లు....
‘మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు’ ఓవైపు రుణమాఫీ వర్తించకపోగా, మరో వైపు ఉన్న అప్పు సకాలంలో చెల్లించని కారణంగా రైతన్నలు అదనపు భారం భరించాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో 2013-14 వరకూ రైతులకు సంబంధించిన రూ. 5308.3 కోట్లు పంట రుణాలు ఉన్నాయి. వీరంతా గత ఏడాది జూలై 31లోపు రుణాలు పొందారు. ఏడాది లోపు పంట రుణాలు రెన్యువల్ చేసుకుంటే రైతన్నలకు వడ్డీలేని రుణం దక్కేది.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం పంట రుణాలు పొందిన రైతులు ఏడాది లోపు రుణాలు చెల్లించకపోతే రూ.13.5 శాతం వడ్డీ భరించాల్సి ఉంది. జూలై 31లోపు ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీ వర్తించి ఉంటే ఎలాంటి సమస్య తలెత్తేదికాదు. ఇప్పటికే ఏడాది పూర్తి అయిన నేపథ్యంలో జిల్లాలోని 5.68 లక్షల మంది రైతులు తీసుకున్న రూ.5308 కోట్లకు గాను రూ.716.58 కోట్లు అదనపు భారం భరించాల్సిన దుస్థితి నెలకొంది.
అలాగే ఇన్స్పెక్షన్ ఛార్జీల రూపేణా బ్యాంకు రుణం ఉన్న ప్రతిరైతు రూ.150 భరించాల్సి ఉంది. ఈ కారణంగా జిల్లాలోని రుణగ్రహీతలైన రైతన్నలు రూ. 8.52 కోట్లు భరించాల్సి పరిస్థితి నెలకొందని బ్యాంకింగ్ నిపుణులు వివరిస్తున్నారు. ఈప్రకారం జిల్లాలో పంట రుణాలు పొందిన రైతులు రూ.725 కోట్లు అదనపు భారం భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆర్థికవేత్తలు వివరిస్తున్నారు.
బీమా సైతం కోల్పోయిన వైనం...
పంట రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంకర్లు పంటల బీమా సౌకర్యం కల్పిస్తారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతంగానికి పంటల బీమా ఆసరగా నిలువనుంది. ఈఏడాది రైతుల రుణాలు రెన్యువల్స్ లేకపోగా పంటల బీమాకు అవకాశం చేజారింది. రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో రుణాల రెన్యువల్స్ గురించి రైతాంగం విస్మరించింది. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయిన రైతాంగం బీమా అవకాశాన్ని కోల్పోయింది.
దగాపడ్డ జనానికి అండగా సమరభేరి...
ప్రభుత్వ వైఖరితో దగా పడ్డ ప్రజానీకానికి అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరభేరి ప్రకటించింది. బుధవారం అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేయ తలపెట్టింది. రుణమాఫీ చేయకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వంపై పోరాటం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి, పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.
రుణం వివరాలు అప్పు మొత్తం(కోట్లలో) రైతులు
క్రాప్లోన్లు 4427.09 5,59,493
టర్మ్డ్లోన్లు 754.89 69,921
కౌలురైతురుణాలు 881.21 9007
మొత్తం 6063.19 కోట్లు 6,38,421
బంగారు రుణాలు 2124.43 5,59,493
మొత్తం 8187.62 11,97,914
దర్నాలు విజయవంతం చేయండి
పులివెందుల: ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు బుధవారం చేపట్టబోయే ధర్నాలు విజయవంతం చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పిలుపునిచ్చారు.
మంగళవారం పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలోని వాగ్దానాలను తక్షణం అమలు చేయాలని, వ్యవసాయ, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీచేసి రైతులను, డ్వాక్రా మహిళలను సంపూర్ణ రుణ విముక్తులను చేయాలన్నారు.
అదేవిధంగా అక్రమంగా తొలగించిన రేషన్ కార్డులు, పింఛన్లు అర్హులైన వారందరికి వెంటనే మంజూరు చేయాలన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అన్ని మండల కార్యాలయాల వద్ద చేపట్టనున్న ధర్నాలు విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.