కలికితురాయి కరీంనగర్
మొదటిసారి ఇక్కడే తెలంగాణ
జెండా ఎగురవేసిన
అనుకున్నట్లే రాష్ట్రం తెచ్చిన
అంతా జిల్లా ప్రజల దీవెన
ఎన్నికల శంఖారావంలో
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : ఉద్యమాల గడ్డ కరీంనగర్ నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల సమరశంఖం పూరించారు. జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన బహిరంగసభలో పద్నాలుగేళ్ల తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన తర్వాత టీఆర్ఎస్ ముందున్న ర్తవ్యం గురించి ఆయన సుదీర్ఘంగా వివరించారు. పద్నాలుగేళ్ల క్రితం ఇదే గ్రౌండ్... ఇదే వేదిక నుంచి తెలంగాణ జెండా ఎగురవేశానని గుర్తు చేసుకున్నారు.
‘ఆ రోజు ఇక్కడున్నోళ్లు... టీవీల్లో చూసినోళ్లు... పొలగాడు బాగానే బయలుదేరిండు గనీ, బక్కపలుచగున్నడు... గీనేతోనేమైద్దీ అనుకున్నరు. మీ అందరి దయ... కరీంనగర్లో మీరిచ్చిన దీవెనతో రాష్ట్రం సాధించిన’ అని ప్రజల హర్షధ్వానాల మధ్య చెప్పారు. మొదటిసారి ఇదే ఎస్సారార్ కళాశాల మైదానంలో ప్రొఫెసర్ జయశంకర్, కెప్టెన్ లక్ష్మీకాంతరావుతో కలిసి బ్రహ్మండమైన సింహగర్జన సభ నిర్వహించి తెలంగాణ ఉద్యమానికి బయలుదేరామని చెప్పారు. కరీంనగర్‌పై తనకు నమ్మకముందని, ఏ పని చేపట్టినా సఫలమవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి సభ కరీంనగర్లో పెట్టుకున్నామని, విజయం ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఓట్లడిగేవాళ్లను చూస్తే సిగ్గేస్తుంది : కే.కేశవరావు
తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నించిన వాళ్లు... వెన్నుపోటుపొడిచిన వాళ్లు... ఎంతోమందిని జైలుకు పంపించినవాళ్లు... తనకు తెలుసని... వాళ్లంతా ఇప్పుడు తెలంగాణ అని అంటే సిగ్గేస్తోందని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు విమర్శించారు.
శంఖారావంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో అమరుల సంతాప తీర్మానాన్ని కూడా చేయలేని వాళ్లు ఈ రోజు అమరుల గురించి మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ ప్రజల జీవితాలను ధన్యం చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు.
కరీంనగర్ సింహస్వప్నం :నాయిని
తెలంగాణ వ్యతిరేకులకు కరీంనగర్ జిల్లా సింహస్వప్నం వంటిదని టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా పోరాటాల పురిటిగడ్డ అని, ఇక్కడి నుంచే తెలంగాణ ఉద్యమం ప్రారంభించి రాష్ట్రం సాధించామన్నారు.
చంద్రబాబు ఏజెంట్ కోటి రూపాయలతో దొరికాడని, టీడీపీతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీకి ఓటు వేస్తే తెలంగాణను అడ్డుకున్న టీడీపీకి వేసినట్లేనన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. కరీంనగర్ లోకసభ అభ్యర్థి బోయినిపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ నవ తెలంగాణ నిర్మాణాన్ని యావత్ ప్రపంచానికి ఈ సభ తెలియచేస్తుందన్నారు. పెద్దపల్లి లోకసభ అభ్యర్థి బాల్క సుమన్ మాట్లాడుతూ రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి తనలాంటి విద్యార్థికి టికెట్ ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు.
కరీంనగర్ భీముడు గంగుల... పులిబిడ్డ పుట్ట మధు
కరీంనగర్ భీముడు గంగుల కమలాకర్ ను గెలిపించాలని కేసీఆర్ చమత్కరించారు. జిల్లాలోని అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను పేరుపేరునా ప్రజలకు పరిచయం చేసి గెలిపించాలని కోరారు. అభ్యర్థుల గురించి చేసిన వ్యాఖ్యలు సభికులను ఉత్సాహపరిచాయి. గంగులను భీముడిగా అభివర్ణించిన కేసీఆర్, పుట్ట మధును బాంబుగా, పులిబిడ్డగా పేర్కొన్నారు.
తన బిడ్డ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొమురంభీం విగ్రహాన్ని పెట్టడానికి వెళితే అడ్డుకొని విగ్రహాన్ని జైలులో పెట్టించాడని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై మండిపడ్డారు. మంథని ప్రజలు చరిత్ర తిరగరాయాలన్నారు. ఈటెల రాజేందర్‌ను పరిచయం చేస్తున్న సమయంలో ప్రజలు కేకలు వేయడంతో, ‘ఈటెలకు గాలి బాగుంది అన్నారు. జగిత్యాల అభ్యర్థి డాక్టర్ సంజయ్‌ను పరిచయం చేసే సమయంలోనూ గోల పెరగడంతో వీళ్లు జగిత్యాలోల్లా...సంజయ్‌కు కూడా గాలిబాగానే ఉందన్నారు.
కరీంనగర్ లోకసభ అభ్యర్థి బి.వినోద్‌కుమార్ గురించి చెబుతూ కరీంనగర్ మిషన్ ఆస్పత్రిలోనే వినోద్‌కుమార్ పుట్టాడని, ఆయనను ఆదరించాలన్నారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి బాల్క సుమన్‌పై మాజీ సీఎం కిరణ్‌కుమార్ 150 కేసులు పెట్టాడన్నారు.
పరిచయం సందర్భంగా కేసీఆర్‌కు పెద్దపల్లి లోకసభ అభ్యర్థి బాల్క సుమన్, చొప్పదండి అసెంబ్లీ అభ్యర్థి బొడిగె శోభ పాదాభివందనం చేశారు. దాసరి మనోహర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, సోమారపు సత్యనారాయణ, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కొప్పుల ఈశ్వర్, వొడితెల సతీష్‌బాబు, చెన్నమనేని రమేశ్‌బాబును పరిచం చేసి గెలిపించాలన్నారు.
పరిచయానికి కేటీఆర్ దూరం
టీఆర్ఎస్ అభ్యర్థుల పరిచయం సమయంలో కేసీఆర్ కుమారుడు, సిరిసిల్ల అభ్యర్థి కేటీఆర్ దూరంగా ఉండడం ఆసక్తి కలిగించింది. సభావేదిక కింద ప్రజల నడుమ కూర్చున్న కేటీఆర్, అభ్యర్థులు ముందుకు రావాలని కేసీఆర్ సూచించినప్పటికీ వేదికనెక్కలేదు. దీంతో 12 మంది అసెంబ్లీ అభ్యర్థులను మాత్రమే కేసీఆర్ పరిచయం చేశారు. నిజామాబాద్ లోకసభ అభ్యర్థి కవిత కూడా కిందనే కూర్చొని వేదికపైకి రాకపోవడంతో ఆమెను పరిచ యం చేయలేకపోయారు.
ఈ సభలో మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, చెన్నాడి సుధాకర్‌రావు, మాజీ మంత్రి కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, జి.రాజేశంగౌడ్, తుల ఉమ, ఓరుగంటి ఆనంద్, తన్నీరు శరత్‌రావు, జి.వి.రామకృష్ణారావు, పన్యాల భూపతిరెడ్డి, సర్ధార్ రవీందర్‌సింగ్, కట్ల సతీశ్, ఎడ్ల అశోక్, గుగ్గిళ్లపు రమేశ్, చల్ల హరిశంకర్, వేల్ముల పుష్పలత, కటారి రేవతిరావు, అక్బర్ హుస్సేన్, దిండిగాల మహేశ్, కోల ప్రశాంత్, అంజద్, గుంజపడుగు హరిప్రసాద్, మైకేల్ శ్రీను, దూలం సంపత్ తదితరులు పాల్గొన్నారు.