‘మిషన్’తో పెరిగిన నీటి నిల్వ సామర్థ్యం
రెండు విడతల్లో 2కోట్లకు పైగా క్యూబిక్ మీటర్ల మట్టి పూడికతీత
పెరిగిన సామర్థ్యం 1.043 టీఎంసీలు
మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి
వరంగల్ : మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన చెరువుల పూడికతీత మరమ్మతులతో జిల్లాలో సుమారు 1.043 టీఎంసీల నీటి సామర్థ్యం పెరిగిందని చిన్ననీటిపారుదల శాఖ ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం వివరాలను వెల్లడించారు. మిషన్–1లో 1,69,74,642 క్యూబిక్ మీటర్ల పూడిక మట్టి తీయగా, రెండో విడతలో ఇప్పటి వరకు 1,28,51,420 క్యూబిక్ మీటర్ల పూడిక మట్టి తీసినట్లు తెలిపారు. జిల్లాలోని చెరువుల్లో మిషన్ కాకతీయ మొదటి విడతలో 1,070 చెరువులను ఎంపిక చేసి పునరుద్ధరణకు రూ.415.52కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఇందులో 1,059 చెరువులకు రూ.243.02కోట్లతో పనులు ప్రారంభించగా అందులో 1,023 చెరువుల పనులు పూర్తయ్యాయని ఆయన వివరించారు. ఇక మిషన్ రెండో విడతలో 1,268 చెరువులను ఎంపిక చేయగా 1,128 చెరువులకు అంచనాలు సమర్పించగా ఇప్పటి వరకు 1,085 చెరువులకు రూ.406.93కోట్లతో పరిపాలన అనుమతులు వచ్చాయన్నారు. అందులో 1,076 చెరువులకు టెండర్లు పిలిచి 1,068పనులకు అగ్రిమెంట్ చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 1,050 చెరువుల పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఇలా పనులు పూర్తయిన చెరువులకు సంబంధించి నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందని ఎస్ఈ వివరించారు.