Sambhaji Raje Chhatrapati
-
తెలుగువారి ప్రేమకు కృతజ్ఞతలు– విక్కీ కౌశల్
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ బయోపిక్‌గా రూపొందిన చిత్రం ‘ఛావా’. విక్కీ కౌశల్, రష్మికా మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న హిందీలో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ నేడు విడుదల చేస్తోంది. ‘‘ఛావా’ తెలుగు ట్రైలర్ దాదాపు 5 మిలియన్ల వ్యూస్ సాధించింది. తెలుగులో 550కి పైగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ‘‘ఛావా’ పట్ల తెలుగువారి అద్భుతమైన సపోర్ట్, ప్రేమకు కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని తెలుగులో తీసుకు వస్తున్నందుకు మేము గర్విస్తున్నాం. శంభాజీ మహారాజ్ కీర్తి, అజేయమైన శౌర్యం, త్యాగాన్ని చూసే అవకాశం మీకు లభిస్తుంది... అలాగే మీ హృదయాలను తాకుతుంది. ఈ చిత్రాన్ని మీరందరూ బిగ్ స్క్రీన్‌పై ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను’’ అంటూ విక్కీ కౌశల్ ఓ వీడియో విడుదల చేశారు. -
శివాజీ వారసుడిపై అభ్యంతరకర కంటెంటా?
ముంబై: వికీపీడియాపై మరాఠాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ వారసుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి అభ్యంతకర కంటెంట్‌ను పోస్ట్ చేయడమే అందుకు కారణం. శంభాజీ జీవిత వృత్తంగా తెరకెక్కిన ఛావా(Chhaava) చిత్రం థియేటర్లలలో ఉండగానే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. శివాజీ తనయుడు, మరాఠా సామ్రాజ్యపు రెండో ఛత్రపతి అయిన శంభాజీ మహరాజ్(Sambhaji Maharaj) గురించి వికీపీడియాలో అభ్యంతరకర సమాచారం పోస్ట్ అయ్యింది. ఈ విషయం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దృష్టికి వెళ్లింది. దీంతో కంటెంట్ తొలగింపు దిశగా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ నేపథ్యంలో ముంబై సైబర్ సెల్ వికీపీడియా(Wikipedia)కు నోటీసులు జారీ చేసింది. ఆ కంటెంట్‌ను తొలగించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు సున్నితమైన ఇలాంటి అంశాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం ఫడ్నవిస్ అభిప్రాయపడ్డారు. ఎవరైనా ఎడిట్ చేయగలిగే వికీపీడియాలో.. ఎడిటోరియల్ నియంత్రణ లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. వికీపీడియాకు కిందటి ఏడాది కేంద్ర ప్రభుత్వం సైతం నోటీసులు జారీ చేసింది. కచ్చితత్వం లేని సమాచారం ఉందన్న ఫిర్యాదుల మేరకు నోటీసులు ఇచ్చింది. మరాఠా సామ్రాజ్య పాలకుడు శంభాజీ మహారాజ్ జీవిత కథను.. ‘ఛావా’ పేరిట భావోద్వేగపూరిత చిత్రంగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తీర్చిదిద్దాడు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని.. కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. ‘ఛావా’లో శంభాజీగా విక్కీ కౌశల్ (Vicky Kaushal) జీవించేయేగా.. శంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక, జౌరంగజేబుగా అక్షయ్ ఖన్నా ఆకట్టుకున్నారు. -
తెలంగాణ నమూనా దేశవ్యాప్తం కావాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అమలవుతున్న ప్రగతి నమూనా మహారాష్ట్ర సహా దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజే ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో కూడా అమలు చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ 13వ వారసుడు, సాహూ మహరాజ్ మనవడు, కొల్హాపూర్ సంస్థాన వారసుడు, స్వరాజ్ ఉద్యమ కారుడు అయిన శంభాజీ రాజె గురువారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేసీఆర్ మధ్యాహ్న భోజనంతో శంభాజీ రాజెకు ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరూ పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో అమల వుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పట్ల ప్రభుత్వ విధానాలను రాజె ఆరా తీశారు. వినూత్న ఎజెండాతో ప్రజల ముందుకు అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కూడా కేసీఆర్, శంభాజీ రాజె నడుమ చర్చ జరిగింది. దేశ అభివృద్ధి, సమగ్రత, ప్రజా సంక్షేమం లక్ష్యంగా వినూత్న ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరముందనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. సందర్భాన్ని బట్టి మరోమారు కలిసి మరిన్ని అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. శంభాజీ రాజె పూర్వీకులు శివాజీ మహరాజ్ నుంచి సాహూ మహరాజ్ దాకా దేశానికి అందించిన సేవలను ఇరువురు స్మరించుకున్నారు. సమానత్వం, ప్రజా సంక్షేమం దిశగా వారందించిన పాలన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘రాజర్షి సాహు ఛత్రపతి’ పుస్తకాన్ని కేసీఆర్‌కు శంభాజీ రాజె అందించారు. ఈ భేటీలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు శంభాజీ రాజెతో పాటు వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
రాజ్యసభకు ఛత్రపతి వారసుడు
న్యూఢిల్లీ: మరాఠా యోధుడైన ఛత్రపతి శివాజీ వారసుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త శంభాజీ రాజే ఛత్రపతి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం ఆయనను పెద్దలసభకు నామినేట్ చేశారు. కొల్హాపూర్‌ను పాలించిన ఛత్రపతి శివాజీ, రాజశ్రీ సాహు వారసుడైన శంబాజీ మహారాష్ట్రలో పలు సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రారంభించిన ఉద్యమానికి ఆయన ఆర్థిక చేయూతనిచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలోని పలు వర్గాల మధ్య సామరస్యాన్ని నెలకొల్పడంలో శంభాజీ విశేష పాత్ర పోషించారని చెప్పాయి. విశ్వ గాయత్రి పరివార్ అధిపతి ప్రణవ్ పాండే తాను రాజ్యసభ స్వభ్యత్వాన్ని స్వీకరించబోనని ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్థానంలో శంభాజీని నామినేట్ చేశారు. ప్రస్తుతం పెద్దల సభలో తనకు అనువైన వాతావరణం లేదని, అందుకే తాను రాజ్యసభ స్వభ్యత్వాన్ని తిరస్కరిస్తున్నానని ప్రణవ్ పాండే పేర్కొన్నారు.