3 వేల ఫోన్కు రూ.45 వేలు
పశుసంవర్థకశాఖ కొనుగోళ్లలో వింత
సాక్షి, హైదరాబాద్: పశుసంవర్ధక శాఖలో కొనుగోళ్లు చూస్తే ఎవరికైనా కళ్లు తిరగాల్సిందే. సంబంధిత శాఖ అవసరాల కోసం వస్తువుల కొనుగోళ్లు జరుగుతున్నప్పుడు అంతో ఇంతో చేతివాటం చూపడం మామూలే. అయితే రూ.3 వేలు విలువ చేసే వస్తువు కొనుగోలుకు ఏకంగా రూ.45,000 నొక్కేసే వింత పశుసంవర్ధక శాఖలో చూడొచ్చు. ‘శామ్సంగ్ సీ3262’ మోడల్ సెల్ఫోన్ కొనుగోలు కోసం రూ.45 వేలు విడుదల చేస్తున్నట్లుగా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ సెక్రటరీ ఎం.జయప్రసాద్ బుధవారం ఉత్తర్వును జారీ చేశారు.
‘పశుసంవర్ధక శాఖలో అధికారిక వినియోగం కోసం’ అని మాత్రమే ఉత్తర్వులో పేర్కొన్నారు తప్ప ఏ అధికారి కోసమో నిర్దిష్టంగా పేర్కొనలేదు. పైగా, ఈ ఉత్తర్వులో ‘ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు’ అని పేర్కొనడం విడ్డూరం. నిజానికి ఈ మోడల్ సెల్ఫోన్ ఖరీదు రూ.3,200 మాత్రమే. కొన్ని ఆన్లైన్ సంస్థలైతే దీనిని రూ.2,800 ధరకే విక్రయిస్తున్నాయి. పశుసంవర్ధక శాఖ వారు మాత్రం ఈ ఫోన్ను తిరుమల మ్యూజిక్ సెంటర్ నుంచి రూ.45 వేలకు కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపారు.