ఆపిల్ టాప్.. శాంసంగ్ ఔట్
టెక్ దిగ్గజం యాపిల్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఫార్చ్యూన్ వరల్డ్ మోస్ట్ ఎడ్మైర్డ్ కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా పది ఏడాది తన హవా చాటింది. సెకెండ్ ప్లేస్‌లో అమెజాన్ నిలవగా, మూడవ స్థానాన్ని స్టార్ బక్స్ దక్కించుకుంది. అయితే సౌత్‌కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ ఈ జాబితాలో చోటును కోల్పోయింది.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఆరాధించబడే సంస్థల వార్షిక జాబితాను ఫార్చ్యూన్ ప్రకటించింది. ఇందులో ఆపిల్ వరుసగా పదవ సంవత్సరం టాప్ లో నిలిచింది. గత సంవత్సరం మూడో స్థానంలో అమెజాన్ మరో స్థానం ఎగబాకి సెకండ్ ప్లేస్ దక్కించుకుంది. మరోవైపు గూగుల్ కు చెందిన అల్ఫాబెట్ గత ఏడాది సాధించిన రెండవ స్థానం నుంచి దిగజారి 6వ స్థానంలోకి పడిపోయింది. ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ ఈ ర్యాంకింగ్‌లో భారీ పురోగతి సాధించాయి. ఫేస్బుక్ 14వ ర్యాంక్ నుంచి ఎగిసి 8వ, మైక్రోసాఫ్ట్ 17వ స్థానం నుంచి ఎగబాకి 9వ ర్యాంకులను దక్కించుకున్నాయి.
అయితే గత ఏడాది 35వ ప్లేస్‌లో ఉన్న శాంసంగ్ ఏడాది అసలు జాబితాలొ లేకుండా పోయింది. గత సంవత్సరం గెలాక్సీ నోట్ 7 పేలుళ్ల కారణంగా ఇబ్బందుల్లో పడ్డ సంస్థ తన ప్రాభవాన్ని కోల్పోయింది. అలాగే దక్షిణ కొరియా కుంభకోణంలో చిక్కుకుని శాంసంగ్ ప్రతినిధి అరెస్ట్ కావడం కంపెనీకి భారీ షాక్ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
పరిశ్రమకు చెందిన దాదాపు 3,800 మంది ఎగ్జిక్యూటివ్‌లు, డైరెక్టర్లు, ఎనలిస్టులు, ఇతర మేధావులునుంచి సేకరించిన డాటా ఆధారంగా ఫార్చ్యూన్, భాగస్వామి కార్న్ ఫెర్రీ హే గ్రూపు తో కలిసి ఈ సర్వే నిర్వహించింది. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 డేటాబేస్ కోసం 10 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ రాబడి ఉన్న అమెరికా, అమెరికాయేతర 1,000 సంస్థలను పరిశీలించినట్టు ఫార్చ్యూన్ ప్రకటించింది.