స్టాండింగ్ కమిటీ తీర్మానం చట్ట విరుద్ధం
తేల్చి చెప్పిన హైకోర్టు ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్పొరేటర్లకు ఐపాడ్లు, పత్రికా ప్రతినిధులకు శామ్సంగ్ ట్యాబ్‌లు ఇవ్వాలన్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ తీర్మానం చట్ట విరుద్ధమని హైకోర్టు తేల్చి చెప్పింది. చట్ట విరుద్ధమైన ఈ తీర్మానం విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.
రూ.72.42 లక్షల వ్యయంతో 150 మంది కార్పొరేటర్లకు, 40 మంది పత్రికా ప్రతినిధులకు ఐపాడ్లు, ట్యాబ్లెట్ల పంపిణీ నిమిత్తం స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసిందని, ఈ పంపిణీని అడ్డుకుని, ఈ మొత్తాన్ని పేదల సంక్షేమం కోసం వ్యయం చేసేలా జీహెచ్ఎంసీని ఆదేశించాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మీర్ మహ్మద్ అలీ అలియాస్ ఖలీద్ హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై వాదనలు విన్న ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ఈ తీర్మానం విషయంలో రెండు నెలల్లోపు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.