టీడీపీకి సనత్ నగర్ షాక్
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో ఘోర పరాజయం రాజకీయంగా టీడీపీ భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చగా, సనత్ నగర్ నియోజకవర్గం ప్రజలు మరో షాకిచ్చారు. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తలసాని శ్రీనివాస యాదవ్ పార్టీకి రాజీనామా చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఎలా ఉంటారని టీడీపీ ప్రశ్నించింది. ఆ విషయంపై స్పీకర్‌తో పాటు గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. పార్టీ ఫిరాయింపులపై కోర్టును కూడా ఆశ్రయించింది.
పార్టీ ఫిరాయించినప్పుడు ఏ పార్టీ అయినా సర్వసాధారణంగా చేసేవే. ఇవిలా ఉండగా, గ్రేటర్ ఎన్నికల ద్వారా తలసానికి టీఆర్ఎస్కు గట్టి షాకివ్వాలని టీడీపీ వ్యూహరచన చేసింది. దమ్ముంటే సనత్ నగర్ లో పోటీ చేసి మళ్లీ గెలవాల్సిందిగా టీడీపీ నేతలు అనేకసార్లు సవాలు చేసిన నేతలు ఈ నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లు గెలుచుకోవడానికి గట్టి వ్యూహం రచించారు. ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించిన చంద్రబాబు కుమారుడు లోకేశ్ అభ్యర్థులకు అవసరానికి మించి సహాయం అందించారు. పార్టీ శ్రేణులను పురామాయించడంతో పాటు రోజు వారిగా సమీక్ష జరిపారు.
ఈ నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లను గెలుచుకోవడం ద్వారా తలసానిపై రాజీనామా ఒత్తిడి పెంచొచ్చని భావించారు. ఇక్కడి నుంచి త్వరలో అసెంబ్లీ ఉపఎన్నికలు తప్పవని పార్టీ నేతలు ప్రచారం నిర్వహించారు. సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అయిదు డివిజన్లు ఉన్నాయి. అమీర్ పేట, సనత్ నగర్, బేగంపేట, బన్సీలాల్ పేట, రాంగోపాల్ పేట డివిజన్లలో ప్రత్యేక ప్రచారం నిర్వహించడంతో పాటు ఇక్కడ పార్టీ అత్యధికంగా నిధులు సమకూర్చింది. చంద్రబాబు నాయుడు సైతం టెలి కాన్ఫరెన్స్ ద్వారా నేతలతో మాట్లాడుతూ ప్రత్యేకంగా పర్యవేక్షించారు.
రాజకీయంగా ఈ ఎన్నికలు ఎంతో ఉపయోగపడుతాయన్న టీడీపీ అంచనాలు ఫలితాలతో తారుమారయ్యాయి. సనత్ నగర్ ప్రజలు టీడీపీ నాయకత్వానికి పెద్ద షాకిచ్చారు. ఈ నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లు కలిపి 24,700 లకు పైగా ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నియోజకవర్గం పరిధిలోని రెండు డివిజన్లను బీజేపీకి కేటాయించగా ఆ రెండింటిలోనూ ఘోర పరాజయం చవి చూడాల్సి వచ్చింది. ఊహించని ఫలితం రావడంతో ఇక్కడ ఇంచార్జీగా వ్యవహరించిన రాష్ట్ర పార్టీ నేతలెవరు తెరమీదకు రావడం లేదు.