అటవీ అధికారులపై ఎర్ర కూలీల దాడులు
► గాలిలోకి నాలుగు రౌండ్ల కాల్పులు
► ఏడుగురు కూలీల అరెస్టు
► 27 ఎర్రచందనం
► దుంగలు స్వాధీనం
చంద్రగిరి : మండలంలోని మూలపల్లి సమీపంలోని శేషాచల అటవీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం అటవీ శాఖ అధికారులపై ఎర్ర కూలీలు దాడులకు దిగారు. అధికారులు ఆత్మరక్షణ కోసం గాలిలోకి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఎఫ్ఆర్వో రఘునాథ్ విలేకరులతో మాట్లాడుతూ శేషాచలంలోకి ఎర్ర కూలీలు భారీగా చేరుకున్నట్లు డీఎఫ్‌వో సుబ్బారెడ్డికు రహస్య సమాచారం అందిందన్నారు. దీంతో శేషాచల అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ను చేపట్టామన్నారు.
ఏనుగుల మడుగు కింద భాగాన 25 మంది కూలీలు దుంగలను మోసుకొస్తుండగా పట్టుకునేందుకు ప్రయత్నించామని పేర్కొన్నారు. కూలీలు తమ వద్ద ఉన్న ఆయుధాలు, రాళ్లతో దాడులకు దిగడంతో ఆత్మరక్షణ కోసం మొదట రెండు రౌండ్లు, తర్వాత మరో రెండు రౌండ్లు కాల్పులు జరిపామని వివరించారు. కూలీలు దుంగలను పడేసి పారిపోతుండగా తిరువణ్ణామలై జావాదిహిల్స్కు చెందిన చిదంబరన్, రామన్, అన్నామలై, చిన్నస్వామి, సెల్విన్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నామని చెప్రాఉ. వారి నుంచి 17 ఎర్రచందనం దుంగలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
మరో ఘటనలో..
శేషాచలం నుంచి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ఇద్దరు తమిళ కూలీలను అరెస్టు చేసి 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు ఎఫ్ఎస్వో ఏవీ సుబ్బయ్య తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ టాస్క్‌ఫోర్స్ అధికారులు శనివారం అర్ధరాత్రి శేషాచలంలో కూంబింగ్ చేపట్టారని తెలిపారు. చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున ఎర్రగుట్ట వద్ద 15 మంది కూలీలు దుంగలను మోసుకొస్తుండగా దాడి చేసేందుకు ప్రయత్నించామన్నారు.
కూలీలు దుంగలను పడేసి పారిపోయేందుకు ప్రయత్నించారని, ఈ క్రమంలో తమిళనాడు జావాదిమలైకు చెందిన మురుగన్, కరుణాకరను అదుపులోకి తీసుకుని 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. దాడుల్లో ఏబీవో హరి, మస్తాన్, బేస్‌క్యాంప్ సిబ్బంది కల్యాణ్, శ్రీను, శివ, చిట్టి, వెంకటేష్, రెడ్డిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.