sandipkumar
-
‘ఫిబ్రవరి 15లోగా పశుగణన పూర్తి చేయండి’
సాక్షి, హైదరాబాద్: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 20వ పశుగణనను ఫిబ్రవరి 15లోగా పూర్తి చేయాలని పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పశుసంవర్థక శాఖ, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుల్తానియా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 48 శాతం పశుగణన పూర్తి అయిందని తెలిపారు. రాష్ట్రంలోని పశువైద్యశాల భవనాలకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో గొర్రెల నట్టల నివారణ మూడో విడత కార్యక్రమం ప్రారంభించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ సంచాలకులు డా.వెంకటేశ్వర్లు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి డా.మంజువాణి తదితరులు పాల్గొన్నారు. -
కోర్టుధిక్కరణ కేసుల్లో హైకోర్టుకు ఐఏఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసుల్లో ఐఏఎస్‌లు సందీప్‌కుమార్ సుల్తానియా, స్మితా సబర్వాల్ శుక్రవారం హైకోర్టు ఎదుట హాజరయ్యారు. వీరి హాజరును నమోదు చేసుకున్న జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ చల్లా కోదండరామ్ నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణకు వీరి హాజరుకు మినహాయింపునిస్తూ విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. కరీంనగర్ జిల్లా చెల్లూరు గ్రామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మహిళా స్వయం శక్తి భవనం నిర్మాణ పనులను సవాల్ చేస్తూ 2009లో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం యథాతథస్థితి కొనసాగించాలని అప్పట్లో ఆదేశించింది. కోర్టు ఆదేశాలు జారీచేసినా భవన నిర్మాణాన్ని ప్రారంభించినా అధికారులు చర్యలు చేపట్టలేదంటూ మల్లయ్య అనే వ్యక్తి కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలంటూ 2009లో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది. 2009 నుంచి భవన నిర్మాణం పూర్తయ్యే వరకూ పనిచేసిన కలెక్టర్లను హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించడంతో సందీప్‌కుమార్, స్మితాసబర్వాల్లు కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేకపోయినందుకు క్షమాపణలు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా తాము కోర్టు ఉత్తర్వులను నిర్లక్షం చేయలేదని విన్నవించారు. వీరి వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. తదుపరి విచారణలకు హాజరుకు మినహాయింపునిస్తూ విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.