సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసుల్లో ఐఏఎస్‌లు సందీప్‌కుమార్ సుల్తానియా, స్మితా సబర్వాల్ శుక్రవారం హైకోర్టు ఎదుట హాజరయ్యారు. వీరి హాజరును నమోదు చేసుకున్న జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ చల్లా కోదండరామ్ నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణకు వీరి హాజరుకు మినహాయింపునిస్తూ విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.
కరీంనగర్ జిల్లా చెల్లూరు గ్రామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మహిళా స్వయం శక్తి భవనం నిర్మాణ పనులను సవాల్ చేస్తూ 2009లో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం యథాతథస్థితి కొనసాగించాలని అప్పట్లో ఆదేశించింది. కోర్టు ఆదేశాలు జారీచేసినా భవన నిర్మాణాన్ని ప్రారంభించినా అధికారులు చర్యలు చేపట్టలేదంటూ మల్లయ్య అనే వ్యక్తి కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలంటూ 2009లో పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది. 2009 నుంచి భవన నిర్మాణం పూర్తయ్యే వరకూ పనిచేసిన కలెక్టర్లను హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించడంతో సందీప్‌కుమార్, స్మితాసబర్వాల్‌లు కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేకపోయినందుకు క్షమాపణలు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా తాము కోర్టు ఉత్తర్వులను నిర్లక్షం చేయలేదని విన్నవించారు. వీరి వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. తదుపరి విచారణలకు హాజరుకు మినహాయింపునిస్తూ విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.
కోర్టుధిక్కరణ కేసుల్లో హైకోర్టుకు ఐఏఎస్‌లు
Published Sat, Dec 13 2014 1:10 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM
Advertisement