హత్యకేసును ఛేదించిన పోలీసులు
ఝరాసంగం : మండలంలోని జొన్నెగావ్ గ్రామంలో ఇటీవల హత్యకు గురైన బేగారి సంగయ్య (52) కేసు ను పోలీసులు ఛేదించారు. హత్యకేసు విషయాన్ని మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో జహీరాబాద్ రూరల్ సీఐ ఆంజనేయులు విలేకరులకు వివరించారు. గ్రామానికి బేగారి సంగయ్య అదే గ్రామానికి చెందిన కనకయ్యతో స్నేహం చేసి మద్యానికి బానిస చేయడంతో పాటు అతడి భూములన్నీ విక్రయించేలా చేశాడు. ఈ నేపథ్యంలో కనకయ్య కుటుం బం ఆర్థికంగా చితికిపోయింది. దీనిని జీర్ణించుకోలేని కనకయ్య కుమారుడు ధన్రాజ్.. బేగారి సంగయ్యను చంపాలని నిర్ణయించాడు. అందులో భాగంగానే బేగారి సంగయ్య లింగంపల్లికి వెళుతున్న విషయాన్ని తెలుసుకుని హత్య చేసేందుకు పథకం పన్నాడు.
తాట్పల్లి నుంచి జొన్నెగావ్కు ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్న బేగారి సంగయ్య గ్రామ శివారులో గల కోమటికయ్య వద్దకు రాగానే ధన్రాజ్ అతడిపై కట్టితో దాడి చేశాడు. అనంతరం పక్కనే ఉన్న గుంతలో పడేశాడు. అనంతరం కల్వర్టుకు ఉన్న రాళ్లను తీసుకుని సంగయ్య ముఖంపై వేసి తనకేమీ తెలియనట్లుగా ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ధన్రాజ్పై అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు అదేశించినట్లు సీఐ తెలిపారు. కేసును ఛేదించిన ఎస్ఐ, పోలీసులను సీఐ అభినందించారు.