మంత్రితో వాగ్వాదం.. మహిళా ఐపీఎస్పై వేటు!
చండీగఢ్: హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్తో వాగ్వాదం చేసిన మహిళా పోలీస్ అధికారిణిపై చర్యలు తీసుకున్నారు. ఫతేహబాద్ ఎస్పీ సంగీతా కలియాపై బదిలీ వేటు వేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. వివరాలిలా ఉన్నాయి.
మంత్రి అనిల్ విజ్.. ఫతేహబాద్ జిల్లా గ్రీవెన్స్, ప్రజా సంబంధాల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఫతేహబాద్ ఎస్పీ సంగీతా కలియా వచ్చారు. జిల్లా పరిధిలోని గ్రామాల్లో అక్రమ మద్యం అమ్మకాలపై ఏ చర్యలు తీసుకున్నారని మంత్రి ఎస్పీని ప్రశ్నించారు. ఏడాదిగా ఎక్సైజ్ చట్టం కింద దాదాపు 2500 కేసులు నమోదు చేసినట్టు ఆమె వివరించారు. దీంతో సంతృప్తి చెందని మంత్రి.. మద్యం మాఫియాతో పోలీసులకు సంబంధాలున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. అయితే ఇది ప్రభుత్వ వ్యవహారమని, మద్యం అమ్మకాలకు లైసెన్స్ ఇచ్చింది ప్రభుత్వమేనని ఎస్పీ ఘాటుగా బదులిచ్చారు. దీంతో ఆగ్రహించిన మంత్రి సమావేశం నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆమెను ఆదేశించారు. అందుకు ఎస్పీ తిరస్కరించడంతో మంత్రి సమావేశం నుంచి వాకౌట్ చేశారు. సమావేశంలో బీజేపీ నాయకులు, కమిటీ సభ్యులు ఆయన్ను అనుసరించారు. మంత్రి ఈ విషయాన్ని హరియాణా డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీపై బదిలీ వేటు వేసినట్టు సమాచారం.